Rice Millers Frauding | రైస్ మిల్లర్ల అక్రమాలకు చెక్ పడేనా!?

రైస్ మిల్లర్ల అక్రమాలకు చెక్ పడేనా!?

•సీఎంఆర్ బకాయిలు, తూకంలో మోసాలు 

హైకోర్టు తీర్పుతో మిల్లర్లకు షాక్  

తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి, కామారెడ్డి:

కామారెడ్డి జిల్లాలో కొందరు రైస్ మిల్లర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు మొదలు ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించే వరకు ప్రతి దశలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంఆర్ చెల్లింపుల్లో మోసం చేస్తూ వేల క్వింటాళ్ల ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

తూకంలో మోసం, ఎమ్మెల్యే ఆగ్రహం  

ఇటీవల జరిగిన ధాన్యం సేకరణలో 100 క్వింటాళ్ల బియ్యం ఉంటే 90 నుంచి 95 క్వింటాళ్లుగా మాత్రమే చూపిస్తున్నారని రైతులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, వెంటనే విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులను సీజ్ చేయాలని డీఎస్‌ఓను ఆదేశించారు.


హైకోర్టులో ఎదురుదెబ్బ  

2021-22 ఖరీఫ్ నుంచి 2024-25 ఖరీఫ్ వరకు జిల్లాలో 40 మంది మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించారు. పౌరసరఫరాల శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తమపై అక్రమంగా కేసులు పెట్టారంటూ మిల్లర్లు హైకోర్టును ఆశ్రయించి ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని కోరారు.


పిటిషన్ కొట్టివేసిన కోర్టు  

ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తేల్చిన హైకోర్టు మిల్లర్ల పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సీఎంఆర్ బకాయిలు ఉన్న మిల్లర్లు తదుపరి ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

రూ.90 కోట్ల బియ్యం బకాయి  

జిల్లాలో మొత్తం 56 మంది మిల్లర్లు ప్రభుత్వానికి రూ.126 కోట్ల విలువైన సీఎంఆర్ చెల్లించాల్సి ఉంది. అధికారుల ఒత్తిడితో 16 మంది 26 కోట్ల బకాయిలు చెల్లించగా, మిగతా 40 మంది రూ.90 కోట్ల బియ్యం ఇవ్వలేదు. దీంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

విజిలెన్స్ దాడుల్లో గుట్టు రట్టు  

హైదరాబాద్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లాలోని మిల్లులపై ఆకస్మిక దాడులు నిర్వహించి ధాన్యం మాయమైన వ్యవహారాన్ని బయటపెట్టారు. ఆఘమేఘాల మీద మిల్లులను స్థాపించి, ధాన్యం తీసుకుని రహస్యంగా అమ్మేయడం గత పదేళ్లుగా జరుగుతోందని తేలింది. విక్రయించిన సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా బాన్సువాడ, బీర్కూర్, వర్ని, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసింది.


బకాయిలు చెల్లించకపోతే కేసులే: డీఎం  

సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై కేసులు నమోదు చేశామని పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీకాంత్ తెలిపారు. వారు హైకోర్టును ఆశ్రయించినా కోర్టు పిటిషన్‌ను తిరస్కరించిందని, బకాయిలు చెల్లించే వరకు చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Post a Comment

Previous Post Next Post