నేర సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు
రౌడీ షీటర్లపై గట్టి నిఘా, సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు
ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని తెలిపారు.
కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసులను సమీక్షించిన ఎస్పీ, ప్రతి కేసులో సాక్షులు, ముద్దాయిలకు సమన్లు తప్పనిసరిగా అందేలా చూసి నేరస్తులకు త్వరగా శిక్ష పడేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారిపై గట్టి నిఘా ఉంచాలని, వివరాలను అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.
ఈ నెలలో నమోదైన కేసులపై స్టేషన్ల వారీగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, వివరాలను ఆన్‌లైన్‌లో సకాలంలో నమోదు చేయాలని చెప్పారు. పాత పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.
ప్రజల్లో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించి కొత్త కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాలపై వేగవంతమైన విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
యువత ఆన్‌లైన్ బెట్టింగ్ వలలో పడకుండా ప్రతి స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, బెట్టింగ్‌ను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. నర్సింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



Post a Comment