తల్లి వదిలేసి వెళ్లిపోవడంతో ఆసుపత్రిలోనే ఎదురుచూస్తున్న బాలికలు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
అమ్మ డబ్బులు తెస్తానని చెప్పి వెళ్లింది... ఇంకా రాలేదు... రాత్రి నుంచి మరుసటి సాయంత్రం వరకు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి గేటు వైపే చూస్తూ కూర్చున్నారు ఆ ఇద్దరు చిన్నారులు....
సోమవారం సాయంత్రం లక్ష్మి తన ఇద్దరు కూతుళ్లతో హైదరాబాద్ వెళదామని బాన్సువాడకు వచ్చింది. రాత్రి వేళ ఆసుపత్రి దగ్గర డబ్బులు పోయాయని, తెచ్చుకుని వస్తానని చెప్పి వెళ్లిన తల్లి మళ్లీ తిరిగి రాలేదు.
పెద్ద కూతురు గంగోత్రి పిట్లం కస్తూరిబాలో 10వ తరగతి, చిన్న కూతురు చిన్న ఎక్లారా స్కూల్లో 2వ తరగతి. మద్నూర్ మండలం చిన్న ఎక్లారా వీళ్ల సొంతూరు. తల్లి మాట నమ్మి ఆసుపత్రిలోనే పడిగాపులు కాసిన ఆ పిల్లలను చివరికి ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు అప్పగించారు.
ఇప్పుడు ఆ చిన్నారులు ఐసీడీఎస్ సంరక్షణలో ఉన్నారు. అమ్మ ఎక్కడ ఉందో తెలియదు. కానీ ఆ చిన్న గుండెల్లో మాత్రం అమ్మ వస్తుందన్న ఆశ ఇంకా చావలేదు. తల్లి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.....
కన్నతల్లి కోసం ఇద్దరు బాలికలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎదురుచూస్తున్న ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది.
డబ్బులు తెస్తానని చెప్పి వెళ్లిన తల్లి
లక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హైదరాబాద్ వెళ్దామని సోమవారం సాయంత్రం బాన్సువాడకు వచ్చింది. రాత్రి సమయంలో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డబ్బులు పోయాయని చెప్పి, డబ్బులు తీసుకొని వస్తానని పిల్లలకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరుసటి రోజు సాయంత్రం వరకు తల్లి తిరిగి రాకపోవడంతో బాలికలు ఆసుపత్రిలోనే ఎదురుచూశారు. చివరకు ఆసుపత్రి సిబ్బంది పిల్లలను బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
ఐసీడీఎస్‌కు అప్పగింత
పిల్లలను ఐసీడీఎస్ శాఖకు అప్పగించనున్నట్లు బాన్సువాడ పట్టణ సీఐ శ్రీధర్ తెలిపారు. వారి స్వగ్రామం మద్నూర్ మండలం చిన్న ఎక్లారా అని బాలికలు పోలీసులకు తెలిపారు.
పెద్ద కూతురు గంగోత్రి పిట్లంలోని కస్తూరిబా పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. చిన్న కూతురు చిన్న ఎక్లారా ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. తల్లి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.


Post a Comment