కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం
73 మందికి కోర్టు శిక్షలు, 10 మందికి జైలు శిక్ష, రూ.97,500 జరిమానా
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 73 మందికి కోర్టు శిక్షలు విధించింది.
జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 73 మందిని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.
జైలు శిక్షలు, జరిమానా విధింపు
కోర్టు మొత్తం రూ.97,500 జరిమానా విధించింది. నలుగురికి ఒక రోజు జైలు శిక్ష, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్ష, ఒకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు. మొత్తం 10 మందికి జైలు శిక్షలు పడ్డాయి.
మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే: ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణిక ఆనందం కోసం చేసే నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుందన్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Post a Comment