SP Visit | పోలీస్ స్టేషన్, టోల్ ప్లాజాను తనిఖీ చేసిన ఎస్పీ



దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర  

బిక్నూర్ టోల్‌ప్లాజా చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా పరిశీలన  

నేర నియంత్రణ, సైబర్ అవగాహన  

ప్రజలతో మమేకం కావాలి  

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు  : ఎస్పీ

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: వార్షిక తనిఖీల్లో భాగంగా దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ బుధవారం  సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.  

రికార్డులు, పరిసరాల తనిఖీ  

సిబ్బందితో మాట్లాడి స్టేషన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఎస్సైలకు ఇచ్చిన ఆదేశాలు సిబ్బందికి చేరాయా లేదా అని ప్రత్యేకంగా పరిశీలించారు. రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారేక్, టెక్నికల్ రూం, చుట్టుపక్కల పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాలను దేవునిపల్లి ఎస్సై రంజిత్‌ను అడిగి తెలుసుకున్నారు.  

ప్రజలతో మమేకం కావాలి  

పోలీసులు గ్రామాల్లో ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమ గ్రామాలను తరచూ సందర్శించాలన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, నీట్ టర్న్ అవుట్ పాటించాలని చెప్పారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యలు త్వరగా పరిష్కరించాలని, డయల్-100 కాల్స్‌పై వేగంగా స్పందించాలని ఆదేశించారు.  

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు  

ఎన్‌హెచ్-44 స్టేషన్ పరిధి గుండా వెళ్తున్నందున రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బ్లాక్ స్పాట్స్‌ గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని, సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.  

నేర నియంత్రణ, సైబర్ అవగాహన  

పాత నేరస్తులు, సస్పెక్ట్‌ల కదలికలపై నిఘా ఉంచి రాత్రి గస్తీ, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. దొంగతనాలపై వెంటనే డిటెక్షన్, అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై యువతలో అవగాహన కల్పించాలని చెప్పారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందజేస్తామన్నారు. బక్రీద్ సందర్భంగా అక్రమ గోవుల రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఎస్పీ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.  

బిక్నూర్ టోల్‌ప్లాజా చెక్‌పోస్ట్ తనిఖీ  

బక్రీద్ నేపథ్యంలో బిక్నూర్ టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతి పత్రాలు, రవాణా ధృవీకరణ పత్రాలు చూడాలని ఆదేశించారు. వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలన్నారు.  

అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో సిబ్బంది ట్రాఫిక్ బ్యాటన్స్, రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించాలని, అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.  

పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల అధికారులు సమన్వయంతో పశువుల రవాణాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. బక్రీద్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.  

ఈ కార్యక్రమాల్లో డీఎస్పీ మధుసూధన్, రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్‌హెచ్‌వో రంజిత్, బిక్నూర్ సీఐ నరేష్, ఎస్సై ప్రభాకర్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post