సదాశివనగర్‌లో హత్యాయత్నం కేసు: ఇద్దరు నిందితుల అరెస్ట్
వ్యక్తిగత కక్షతో కారుతో ఢీకొట్టి కర్రతో దాడి
మారుతి 800 కారు, చెక్క కర్ర, ఐఫోన్ స్వాధీనం
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తేదీ 27-06-2026 రాత్రి సుమారు 8 గంటల సమయంలో ధర్మారావుపేట గ్రామానికి చెందిన గైని రమేష్ తన మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని కారు వెనుక నుండి ఢీకొట్టి, అనంతరం చెక్క కర్రతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో గతంలో నమోదైన క్రిమినల్ కేసు కారణంగా ఏర్పడిన వ్యక్తిగత కక్షతో ధర్మారావుపేట గ్రామానికి చెందిన గాండ్ల లావణ్య ఆమె తమ్ముడు గాండ్ల సతీష్ ముందస్తు పథకం ప్రకారం గైని రమేష్‌ను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కారుతో అతని మోటార్ సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టి, అనంతరం చెక్క కర్రతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర దర్యాప్తు ఆధారాల మేరకు నిందితులు గాండ్ల లావణ్య మరియు గాండ్ల సతీష్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఘటనలో ఉపయోగించిన మారుతి 800 కారు, చెక్క కర్ర, ఐఫోన్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలం నుంచి ఇతర భౌతిక ఆధారాలను కూడా సీజ్ చేశారు.
నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు సదాశివనగర్ ఎస్‌హెచ్‌ఓ పుష్పరాజ్ తెలిపారు.
సదాశివనగర్ ఎస్‌హెచ్‌ఓ పుష్పరాజ్ మాట్లాడుతూ వ్యక్తిగత కక్షలు, పగలు, ప్రతీకార భావంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్రమైన నేరమని అన్నారు. ఎలాంటి విభేదాలు ఉన్నా చట్టపరమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని సూచించారు. హత్యాయత్నాలు, దాడులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
--------------------------------
ఒడిశాలో ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి నిందితుల అరెస్ట్
12 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం
దేవున్‌పల్లి కేసు దర్యాప్తులో కామారెడ్డి పోలీసుల ముందడుగు
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
కామారెడ్డి జిల్లా దేవున్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసు దర్యాప్తులో జిల్లా పోలీసులు మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందాలు ఒడిశా రాష్ట్రానికి వెళ్లి కేసులో పరారీలో ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్టైన నిందితులు:
1. రాజు అలియాస్ రాజ్ కిషోర్ ప్రధాన్, 29 సంవత్సరాలు, గుంజిబాడి గ్రామం, సారంగఢ మండలం, కంధమాల్ జిల్లా, ఒడిశా.
2. దీపక్ అలియాస్ దీపక్ ప్రధాన్, 20 సంవత్సరాలు, గుంజిబాడి గ్రామం, సారంగఢ మండలం, కంధమాల్ జిల్లా, ఒడిశా.
పోలీసుల విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో గంజాయిని సాగు చేసి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు అంగీకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కరీముల్లాకు సుమారు 387 కిలోల గంజాయిని సరఫరా చేసినట్లు, మిగిలిన 12 కిలోల గంజాయిని చెల్లింపు అనంతరం అందజేయాలని ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.
ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుల వద్ద నుండి సుమారు రూ.6 లక్షల విలువ చేసే 12 కిలోల గంజాయి, నేరానికి ఉపయోగించిన 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అనంతరం నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై కామారెడ్డికి తీసుకువచ్చి, చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ సాగు, రవాణా, విక్రయాలపై కామారెడ్డి జిల్లా పోలీసులు ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగిస్తారని స్పష్టం చేశారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ రహిత కామారెడ్డి జిల్లా నిర్మాణమే పోలీసుల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

إرسال تعليق