99 రోజుల కార్యాచరణలో జిల్లా పనితీరు అభినందనీయం
విద్య, ఆరోగ్యం, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచన
కలెక్టర్, ఎస్పీ తో కలిసి సమీక్ష
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అమలులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేలా అధికారులు సమష్టిగా కృషి చేయాలని ప్రత్యేక అధికారి బి. విజయేంద్ర సూచించారు.
శనివారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అమలుపై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి విచ్చేసిన ఎస్‌సీడీ కార్యదర్శి, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి & ఎస్‌సీడీ కమిషనర్ (ఎఫ్‌ఏసీ) బి. విజయేంద్రకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పూలమొక్కను అందించి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై 10 శాఖలకు సంబంధించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి విజయేంద్ర మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాను అభివృద్ధిలో మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలితాలు ప్రతి లబ్ధిదారునికి చేరేలా పనిచేయాలని సూచించారు. 99 రోజుల కార్యాచరణలో చేపట్టిన పనులను శాఖల వారీగా స్పష్టమైన ప్రణాళికతో అమలు చేసి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారులను అభినందించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన చర్యలను ప్రశంసించారు. గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు, అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు.
విద్యా రంగంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెంచాలని, ప్రతి అర్హ విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.
వర్షాకాలం దృష్ట్యా సంక్షేమ హాస్టళ్లలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు దోమతెరలు వినియోగించాలని, అవసరమైన మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్‌వీ గిరి, డీఎఫ్‌వో నిరాజ్, డీఆర్వో పాండు, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.






إرسال تعليق