Top News

Theft Case | సదాశివనగర్ ఆలయ చోరీ కేసు ఛేదింపు: ఇద్దరు అంతర్-జిల్లా దొంగల అరెస్ట్

కామారెడ్డి పోలీసుల ‘ఆపరేషన్ కవచ్’ సక్సెస్  

_సదాశివనగర్ ఆలయ చోరీ కేసు ఛేదింపు: ఇద్దరు అంతర్-జిల్లా దొంగల అరెస్ట్_  

_దేవత వెండి కండ్లు, నగదు, బైక్ స్వాధీనం_  

_9 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు: జైలుకెళ్లినా మారని బుద్ధి_  

_సీఐ సంతోష్ కుమార్ వివరాల వెల్లడి_

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 22: జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ కవచ్” లో భాగంగా సదాశివనగర్ పోలీసులు మరో విజయం సాధించారు. సదాశివనగర్ లోని శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును గంటల వ్యవధిలో ఛేదించి ఇద్దరు అంతర్-జిల్లా ఘరానా దొంగలను అరెస్టు చేశారు.

అసలేం జరిగింది?  

ఈ నెల 20వ తేదీ అర్థరాత్రి సదాశివనగర్ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అమ్మవారి వెండి కండ్లు, చీర, హుండీతో పాటు అందులోని నగదును అపహరించుకెళ్లారు. ఆలయ కమిటీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆపరేషన్ కవచ్‌కు చిక్కిన దొంగలు

చోరీ అనంతరం తెల్లవారడంతో పోలీసులకు దొరికిపోతామనే భయంతో నిందితులు హీరో ప్యాషన్ ప్రో బైక్, హుండీ, వెండి కండ్లను సమీపంలోని పొదల్లో దాచిపెట్టి పరారయ్యారు. ఈరోజు తెల్లవారుజామున దాచిన సొత్తును తరలించేందుకు తిరిగి వచ్చారు.

పద్మాజీవాడి ఎక్స్ రోడ్ వద్ద ‘ఆపరేషన్ కవచ్’ లో భాగంగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను అనుమానించి తనిఖీ చేయగా దేవాలయ హుండీ, వెండి కండ్లు లభించాయి. విచారణలో గుడిలో దొంగతనం చేసింది తామేనని ఒప్పుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు  

1. ఉప్పల నాగరాజు (34), తండ్రి: సుబ్బరాయుడు, కృష్ణాపురం తడిగొట్ల, కడప జిల్లా  

2. తవటం సంతోష్ (30), తండ్రి: రాయమల్లు, ధర్మపురి, జగిత్యాల జిల్లా

ఘరానా దొంగల చరిత్ర  

నిందితులిద్దరూ ఆస్తి సంబంధిత నేరాల్లో ఆరితేరిన పాత నేరస్తులు. గతంలో నిజామాబాద్, మెట్పల్లి, కథలాపూర్, ధర్మపురి, జగిత్యాల, కొడిమ్యాల్, వర్ని, కోరుట్ల, వెల్గటూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చారు. జైలు నుంచి వచ్చినా బుద్ధి మారక మళ్లీ కామారెడ్డి జిల్లాలో చోరీకి పాల్పడి ‘ఆపరేషన్ కవచ్’ ఉచ్చులో చిక్కుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు  

ఎల్లమ్మ అమ్మవారి వెండి కండ్లు, చీర, హుండీలోని నగదు రూ.400, చోరీకి ఉపయోగించిన హీరో ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్ (AP 09 BS 5800) స్వాధీనం చేసుకున్నారు.

తక్కువ సమయంలోనే శాస్త్రీయ ఆధారాలతో నిందితులను పట్టుకున్న సదాశివనగర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని సీఐ బి.సంతోష్ కుమార్ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post