•పనసపండ్ల మాటున రూ.1.93 కోట్ల గంజాయి రవాణా
•కామారెడ్డి పోలీసుల భారీ ఆపరేషన్
•ఒడిశా నుంచి నాసిక్‌కు తరలిస్తున్న 387 కిలోల గంజాయి సీజ్
•ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్: ఎస్పీ రాజేష్ చంద్ర
•‘ఆపరేషన్ కవచ్’తో డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం
•జాతీయ రహదారి-44పై దొరికిన అశోక్ లేలాండ్ వాహనం
(తెలంగాణ డైలీ న్యూస్-కామారెడ్డి)
పనసపండ్ల ముసుగులో అక్రమంగా తరలిస్తున్న రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయిని కామారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (SP ప్రెస్ మీట్ వీడియో 👇)
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం... జూన్ 20న ఒడిశా నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు గంజాయి తరలిస్తున్నట్లు దేవున్‌పల్లి పోలీసులకు సమాచారం అందింది. ఎస్పీ ఆదేశాలతో కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్ పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
జాతీయ రహదారి-44పై క్యాసంపల్లి శివారు రాయల్ ధాబా వద్ద తనిఖీల్లో అశోక్ లేలాండ్ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వాహనంలో పైభాగంలో చిందరవందరగా పనసపండ్లు ఉంచి, వాటి కింద సంచుల్లో గంజాయిని దాచినట్లు గుర్తించారు.
అరెస్టైన నిందితులు:
1. షేక్ కరిముల్లా @ కరీం, 41, నిజామాబాద్ జిల్లా
2. గైని సుభాష్, 35, నిజామాబాద్ జిల్లా
3. షేక్ రహీమ్, 50, నిజామాబాద్ జిల్లా
స్వాధీనం చేసుకున్నవి: 387.128 కిలోల గంజాయి విలువ రూ.1,93,56,400, అశోక్ లేలాండ్ వాహనం, 2 మొబైల్ ఫోన్లు, రూ.500 నగదు, పనసపండ్లు.
“యువత భవిష్యత్తే కామారెడ్డి పోలీసుల ధ్యేయం. ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతున్నాం. స్మగ్లర్లు రూట్ మార్చినా దొరకాల్సిందే” అని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.
గంజాయి అక్రమ రవాణా ముఠాను పట్టుకున్న కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్, రూరల్ సీఐ శ్రీధర్, దేవనపల్లి ఎస్ఐ రంజిత్, బీబీపేట్ ఎస్ఐ విజయ్, పిట్లం ఎస్ఐ అంజనేయులు, మాచారెడ్డి ఎస్ఐ అనిల్, సదాశివనగర్ ఎస్ఐ పుష్పరాజ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
మాదకద్రవ్యాల సమాచారం ఉంటే డయల్ 100 లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ కోరారు.



Post a Comment