భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని డీటీఓ వెంకన్న మృతి
_విధి నిర్వహణలో ఉండగా ప్రమాదం_
_చెల్పూరు ఆర్టీఓ కార్యాలయం ఎదుట జరిగిన ఘటన_
_డ్రైవర్ నిర్లక్ష్యంతో టిప్పర్ దూసుకెళ్లి ఢీకొట్టింది_
_15 రోజుల క్రితమే జగిత్యాల నుంచి బదిలీపై వచ్చిన వెంకన్న_
_మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ సంతాపం_
తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వెంకన్నను టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
అసలేం జరిగింది?
చెల్పూరులోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట డీటీఓ వెంకన్న వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒక టిప్పర్‌ను ఆపే ప్రయత్నం చేయగా, డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో టిప్పర్ నేరుగా వెంకన్నను ఢీకొట్టి ఆయనపై నుంచి దూసుకెళ్లింది. నడుముపై నుంచి వెల్లటం వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
15 రోజుల క్రితమే బదిలీ
మృతుడు వెంకన్న 15 రోజుల క్రితమే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. ప్రమాదం రవాణా శాఖ కార్యాలయం ఎదురుగానే జరగడంతో ఆర్టీఓ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కేవలం ప్రమాదమా లేక తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో జరిగిన నిర్లక్ష్యమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రభుత్వం సంతాపం, హామీ
విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.



Post a Comment