కామారెడ్డి కాంగ్రెస్‌లో రాజీ: గాంధీభవన్‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి మధ్య సయోధ్య
_క్రమశిక్షణ కమిటీ ముందు వివాదానికి ఫుల్‌స్టాప్_
_ఆడియో టేపులు తనవి కావని షబ్బీర్ అలీ స్పష్టీకరణ_
_గత వ్యాఖ్యలపై తదుపరి భేటీలో చర్చిస్తాం: మల్లు రవి_
_బహిరంగ విమర్శలు వద్దు, కలిసి పనిచేయండి: కమిటీ ఆదేశం_
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్, జూన్ 21: కామారెడ్డి కాంగ్రెస్‌లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటకు గాంధీభవన్ వేదికగా ముగింపు పడింది. ఆదివారం క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పరస్పరం రాజీకి వచ్చారు.
గాంధీభవన్‌లో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఇరువురు నేతలు విభేదాలు విడిచిపెట్టి కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలకు స్వస్తి పలికి పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తామని కమిటీ ఎదుట హామీ ఇచ్చారు.
వైరల్ ఆడియోపై షబ్బీర్ అలీ క్లారిటీ
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వివాదాస్పద ఆడియో టేపులపై షబ్బీర్ అలీ కమిటీకి వివరణ ఇచ్చారు. ఆ ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదని, తనకు దానితో ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు, పరువు తీసేందుకే ప్రత్యర్థులు కావాలని ఆ ఆడియోను క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
పాత వ్యాఖ్యలపై తర్వాత చర్చషబ్బీర్ అలీ గతంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని వచ్చే సమావేశాల్లో పూర్తిస్థాయిలో చర్చిస్తామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వెల్లడించారు. ప్రస్తుతానికి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందని, ముందు పార్టీ ఐక్యత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
కమిటీ కీలక సూచనలు
పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలకు గట్టిగా సూచించింది. వ్యక్తిగత ఈగోలను పక్కనబెట్టి కాంగ్రెస్ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని ఆదేశించింది.
నియోజకవర్గంలో ఏదైనా సమస్య వస్తే హైకమాండ్ దృష్టికి అంతర్గతంగా తీసుకెళ్లాలని, మీడియా ముందు, బహిరంగ వేదికలపై విమర్శలు చేసుకోవద్దని స్పష్టం చేసింది. స్థానిక వివాదాల కోసం నేతలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం పార్టీ పరువుకు భంగకరమని, ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని మల్లు రవి హెచ్చరించారు.


Post a Comment