జూదం, బెట్టింగ్ స్థావరాలపై పోలీసుల దాడులు
_బిచ్కుంద, ఎల్లారెడ్డి పరిధిలో 13 మంది అరెస్ట్_
_రూ.16,430 నగదు, 10 మొబైళ్లు, 13 బైకులు స్వాధీనం_
_అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ హెచ్చరిక_
_డయల్-100కు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి_
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 22: జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలపై కామారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదివారం బిచ్కుంద, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.
బిచ్కుందలో పేకాట స్థావరంపై దాడి
విశ్వసనీయ సమాచారంతో బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని కందర్‌పల్లి గ్రామ శివారులో ఎస్‌ఐ జి. రాజు ఆధ్వర్యంలో దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, ముగ్గురు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.5,230 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఎల్లారెడ్డిలో హెడ్ అండ్ టెయిల్ జూదం
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో హెడ్ అండ్ టెయిల్ జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, ఆరుగురు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.11,200 నగదు, 13 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ హెచ్చరిక
జూదం, బెట్టింగ్ వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తులు, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. జిల్లాలో అక్రమ జూదం, పేకాట, బెట్టింగ్ స్థావరాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో ఎక్కడైనా జూదం, పేకాట, బెట్టింగ్ లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలలో మొత్తం 37 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా మొత్తం ₹52,700/- జరిమానా విధించబడింది.
అదేవిధంగా 14 మందికి ఒక రోజు జైలు శిక్ష, 2 మందికి రెండు రోజుల జైలు శిక్ష విధించబడింది.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా పోలీసులు సూచించారు.




Post a Comment