Top News

Cordon Search in RR Dubba | బాన్సువాడ రాజారాం దుబ్బలో భారీ కార్డెన్ సర్చ్

బాన్సువాడ రాజారాం దుబ్బలో భారీ కార్డెన్ సర్చ్ 

వర్షంలోనూ వందలాది పోలీసులతో తనిఖీలు

అక్రమ వాహనాలు సీజ్, ఇళ్లు-దుకాణాల సోదాలు

బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని రాజారాం దుబ్బ కాలనీలో బుధవారం ఉదయం పోలీసు శాఖ భారీ కార్డెన్ సర్చ్ నిర్వహించింది. ఒకవైపు వర్షం కురుస్తున్నా వందల సంఖ్యలో పోలీసు బలగాలు కాలనీలోకి ప్రవేశించి సోదాలు చేపట్టడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.

ఆపరేషన్ వివరాలు:

తెల్లవారుజామున పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చి డ్యూటీ విధులు, తనిఖీల విధానం గురించి సూచనలు చేశారు.  ఉదయం కార్డెన్ సర్చ్‌లో భాగంగా రాజారాం దుబ్బా ప్రాంతంలోని ప్రధాన రోడ్లు, సందుల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వందలాది మంది పోలీసులు కాలనీని చుట్టుముట్టారు. ప్రజలు గొడుగులు పట్టుకుని నిలబడగా, పోలీసులు ఇళ్ల వరుసల్లో, రోడ్లపై గస్తీ తిప్పారు. 

ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర ధ్రువపత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని పదుల సంఖ్యలో బైక్ లు, ఆటోలు, కార్లను అక్కడికక్కడే సీజ్ చేసి ఒక లైన్ లో నిలిపారు. 

అదే సమయంలో కాలనీలోని దుకాణాలు, ఇళ్లలోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. ఈ తనిఖీల్లో బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్ది , సీఐ శ్రీధర్ తో పాటు వివిధ మండలాల ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్పీ, సీఐ స్వయంగా ఫీల్డ్ లో ఉండి తనిఖీలు పర్యవేక్షించారు. ఈ తనిఖీల్లో బాన్సువాడ డివిజన్‌కు చెందిన సుమారు 140 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కార్డెన్ సర్చ్‌లో భాగంగా పోలీసులు 112 మోటార్‌సైకిళ్లు, 5 కార్లు, 18 ఆటోలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 13 మోటార్‌సైకిళ్లతో పాటు ఒక ఆటోను పోలీసులు జప్తు చేశారు.

 Video 👇


ఇంటింటికీ వెళ్లి ఆధార్ తనిఖీ  

పోలీసులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి లబ్ధిదారుల ఆధార్ కార్డులను చెక్ చేశారు. ఇరుగుపొరుగువారు ఎవరైనా మద్యం సేవించి ఇబ్బందులు గురిచేస్తున్నారా, మహిళలను వేధిస్తున్నారా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారా, గంజాయి వినియోగిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.  డీఎస్పీతోపాటు సీఐలు, ఎస్సైలు కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేరస్తులు ఎవరైనా కాలనీలో వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారా అని ఆరా తీశారు.  

ప్రజల్లో భద్రతా భావం పెంపొందించేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్  : డి ఎస్పీ విఠల్ రెడ్డి 

● ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు

● ప్రజల సంరక్షణ, భద్రతే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల నిర్వహణ

ప్రజల రక్షణ, సంరక్షణను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర  ఆదేశాల కమ్యూనిటీ కాంటాక్ట్ (Cordon & Search) కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి తెలిపారు. 

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలు వంటి సామాజిక రుగ్మతలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. దొంగతనాలు, దోపిడీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవించాలని కోరారు. నేరాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, కాలనీకి మంచి పేరు తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే విద్యాపట్ల ఆసక్తి పెంపొందించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పిల్లలు అసాంఘిక కార్యకలాపాల బారిన పడకుండా పర్యవేక్షించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని, ముఖ్యంగా ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలని సూచించారు.

నంబర్ ప్లేట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 

 "కార్డెన్ సర్చ్ ద్వారా కాలనీలో శాంతిభద్రతలు కాపాడవచ్చు. చట్టవ్యతిరేక కార్యక్రమాలు, దొంగతనాలు, డ్రగ్స్ అరికట్టవచ్చు. నేరస్తులను పట్టుకునేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి" అని తెలిపారు.

యువత డ్రగ్స్, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. దొంగిలించబడిన వాహనాలను చౌకగా వస్తున్నాయని కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. అలాంటి వాహనాలు కొంటే వారిపైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రవృత్తి గల దొంగలు, అనుమానితులను గుర్తించేందుకు ఈ తనిఖీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రశాంత వాతావరణం కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహించామని డీఎస్పీ విటల్ రెడ్డి పేర్కొన్నారు. కొందరు దొంగ వాహనాలను వినియోగిస్తున్నారని, గంజాయి, మద్యం సేవిస్తున్నారని తెలుసుకొని ఇక్కడ సెర్చ్ నిర్వహించామని తెలిపారు.  కొందరు నేరాలు చేసిన వాహనాలు కొంటారని, దొంగిలించిన వాహనాలు ఉంటాయని వాటన్నిటిని గుర్తిస్తున్నామని అన్నారు.

కొందరు ఆకతాయిలు అమ్మాయిలను వేధించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతున్నందున వారిపై చర్యలు తీసుకునేందుకు విస్తృతంగా తనిఖీ చేసినట్టు చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తే వెంటనే ఫోన్ ద్వారా లేదా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో  ఇన్‌స్పెక్టర్స్, బాన్సువాడ సబ్‌డివిజన్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

స్థానికుల స్పందన

ఉదయాన్నే భారీగా పోలీసులను చూసి మొదట కాలనీవాసులు కొంత ఆందోళన చెందినా, తనిఖీల ఉద్దేశాన్ని తెలుసుకున్న తర్వాత పోలీసుల చర్యలను స్వాగతించారు. ఇలాంటి కార్డెన్ సర్చ్‌లతో నేరాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించడంతో కాలనీలోని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల తనిఖీల వల్ల కాలనీలో ప్రశాంతత నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. 

సుమారు 2-3 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ తో కాలనీలో పోలీసుల పట్ల భయం, భక్తి రెండూ పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.







కార్డెన్ సర్చ్ అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ 

 ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని పోలీసులు అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి, లోపలికి వచ్చే, బయటికి వెళ్లే మార్గాలను మూసివేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం. ఇందులో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, దుకాణాలు, ఇళ్లు, అనుమానిత ప్రదేశాలన్నింటినీ తనిఖీ చేస్తారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాలు, డ్రగ్స్, అక్రమ వాహనాలు, నేరస్తులను గుర్తించేందుకు ఈ ఆపరేషన్ ఉపయోగపడుతుంది.



Post a Comment

أحدث أقدم