విధుల్లో నిర్లక్ష్యం: కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి సస్పెండ్ - జిల్లా ఎక్సైజ్ అధికారి
కామారెడ్డి: మద్నూర్ మండలం సలబత్‌పూర్ ఇంటర్ స్టేట్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణలపై కానిస్టేబుల్ బి. సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి ముకుంద రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కామారెడ్డి జిల్లా, మద్నూర్ మండల పరిధిలోని సలబత్‌పూర్ ఇంటర్ స్టేట్ చెక్‌పోస్ట్ మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేయబడిన అధికారిక తనిఖీ కేంద్రం. ఈ కేంద్రానికి సంబంధించిన ఒక వీడియో 30.07.2026 నాడు సామాజిక మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ దానిని తీవ్రంగా పరిగణించింది.
విచారణలో ఏమేం తేలింది?
జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి బి. ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి విచారణ నిర్వహించారు. విచారణ నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించడంతో సలబత్‌పూర్ ఇంటర్ స్టేట్ చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బి. సుధాకర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేశారు.
ఎక్సైజ్ శాఖ స్పందన
ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులను నోడల్ అధికారి/కరీంనగర్ జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి జారీ చేయగా, వాటిని సదరు కానిస్టేబుల్‌కు సర్వ్ చేసినట్లు జిల్లా మద్య నిషేధ, అబ్కారీ అధికారి కామారెడ్డి తెలిపారు.
అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ మద్యం, నిషేధిత పదార్థాల రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్ట్‌లను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నామని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.







إرسال تعليق