రష్యా వర్క్ పర్మిట్ పేరుతో రూ.9.37 లక్షల మోసం – అంతర్ జిల్లా వ్యక్తి అరెస్ట్
నిందితుడి నుంచి నగదు, పాస్‌పోర్టులు, బైక్ స్వాధీనం
డిఎస్పి యస్. మధుసూదన్ వెల్లడి
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
రష్యాలో వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.9.37 లక్షలు మోసం చేసిన కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఎలా జరిగింది మోసం?
మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మ చెరువు తండాకు చెందిన బుక్యా నరేష్, అతని స్నేహితులకు రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిందితుడు నమ్మించాడు. వీసా ప్రాసెసింగ్ పేరుతో మొత్తం రూ.9,37,000/- వసూలు చేసి, అసలైన వర్క్ పర్మిట్ వీసాలు ఇవ్వకుండా నకిలీవి అందజేశాడు. బాధితుల పాస్‌పోర్టులను కూడా తిరిగి ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ప్రధాన నిందితుడు గలేటి వెంకటయ్య @ వెంకటేష్ @ వెంకట్, అతని ఇద్దరు సహచరులపై కేసు నమోదు చేశారు. వీడియో 👇
అరెస్ట్ ఇలా జరిగింది
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ యస్. మధుసూదన్ పర్యవేక్షణలో, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, మాచారెడ్డి ఎస్‌ఐ అనిల్, సిబ్బంది కేసును దర్యాప్తు చేశారు. బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ఆధారాలు, సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించారు.
06-07-2026న మాచారెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట వాహన తనిఖీల్లో ప్రధాన నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా, సహచరులతో కలిసి విదేశీ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చినట్లు అంగీకరించాడు.
స్వాధీనం చేసిన సొత్తు
నిందితుడి వద్ద నుంచి పోలీసులు
1. రూ.45,000/- నగదు
2. బాధితులైన భుక్యా జితేందర్, గుగులోత్ సురేష్, మలోత్ నితిన్‌లకు చెందిన 3 భారతీయ పాస్‌పోర్టులు
3. ఒక OPPO మొబైల్ ఫోన్
4. మోసం చేసిన డబ్బుతో కొన్న హీరో ప్యాషన్ ప్లస్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరో బాధితుడు బుక్యా నరేష్ పాస్‌పోర్టు సహ నిందితుడి వద్ద ఉన్నట్లు నిందితుడు తెలిపాడు. పరారీలో ఉన్న సహ నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
నిందితుడి వివరాలు
గలేటి వెంకటయ్య @ వెంకటేష్ @ వెంకట్, తండ్రి: వెంకటేశ్వర్లు, వయసు: 34 సం, నివాసం: నిజామాబాద్ జిల్లా.
ప్రజలకు ఎస్పీ సూచన
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పే వ్యక్తులు లేదా అనధికారిక మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని సూచించారు. విదేశీ ఉద్యోగాల కోసం తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా లేదా అనుమానాస్పదంగా వ్యవహరించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.


Post a Comment