Top News

Suicide Attempt | సమయస్ఫూర్తితో ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న కానిస్టేబుల్ అజర్

సమయస్ఫూర్తితో ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న కానిస్టేబుల్ అజర్  

బ్రిడ్జిపై నుంచి దూకబోతున్న వ్యక్తిని కాపాడి కుటుంబానికి అప్పగింత  

జిల్లా ఎస్పీ అభినందనలు

కామారెడ్డి: విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా అప్రమత్తంగా స్పందించిన సదాశివనగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అజర్ ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు.

నిన్న రాత్రి 9:00 గంటల సమయంలో కామారెడ్డికి వెళ్తున్న కానిస్టేబుల్ అజర్ అడ్లూర్-ఎల్లారెడ్డి బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా నిలబడి ఉండటాన్ని గమనించారు. వెంటనే అక్కడికి చేరుకుని విచారించగా, పందిరి నాగరాజు, తండ్రి: బాలయ్య, కులం: బెస్త, నివాసం: అడ్లూర్, ఎల్లారెడ్డి కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు.

కానిస్టేబుల్ అజర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధైర్యం చెప్పి నాగరాజును సురక్షితంగా కాపాడారు. అనంతరం అతడికి కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. చివరకు నాగరాజును సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,  కానిస్టేబుల్ అజర్ చూపిన అప్రమత్తత, మానవత్వం, సమయస్ఫూర్తిని అభినందించారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు.

కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యలతో ఎవరూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ప్రతి సమస్యకు చట్టబద్ధమైన, సామాజికమైన పరిష్కార మార్గాలు ఉంటాయని పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم