నకిలీ పత్రాలతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కేసు ఛేదన
భార్య, మామ సహా ముగ్గురి అరెస్ట్
అసలు యజమాని స్థానంలో మరొకరిని నిలబెట్టి రిజిస్ట్రేషన్ - దేవునిపల్లి పోలీసుల సంచలన దర్యాప్తు
భూములు కొనే ముందు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
కామారెడ్డి: నకిలీ పత్రాలతో ప్లాట్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసును దేవునిపల్లి పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతని భార్య, మామను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి ఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు.
కేసు వివరాలు
గంభీరావుపేటకు చెందిన ముక్తావరం శాంత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త ముక్తావరం వెంకటయ్య పేరుపై దేవునిపల్లి వార్డు పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ, సర్వే నెం.210/1లో ఉన్న ప్లాట్ నెం.71 - సుమారు 200 చదరపు గజాల భూమిని - నకిలీ పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఆదేశాలతో, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో, కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ దేవునిపల్లి ఎస్‌హెచ్‌ఓ రంజిత్ కేసును దర్యాప్తు చేశారు. సాక్షుల వాంగ్మూలాలు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రికార్డులు, రెవెన్యూ పత్రాలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
అప్పులు తీర్చేందుకు కుట్ర
దర్యాప్తులో ప్రధాన నిందితుడు బండారి శ్రీనివాస్ రెడ్డి అప్పులు తీర్చుకునేందుకు ఈ పథకం వేసినట్లు తేలింది. తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా చూపించాడు. అసలు యజమాని ముక్తావరం వెంకటయ్య స్థానంలో తన మామ గున్‌రెడ్డి సంగారెడ్డిని నిలబెట్టి, తప్పుడు గుర్తింపు పత్రాలతో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాడు.
ఆ తర్వాత అదే భూమిని అసలు విషయం దాచిపెట్టి ఇతరులకు విక్రయించినట్లు, ఆ స్థలం పలువురి పేర్లపై వరుసగా రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు.
అరెస్ట్ అయిన నిందితులు :
1. బండారి శ్రీనివాస్ రెడ్డి - ప్రధాన నిందితుడు
2. బండారి సునీత - భార్య, ఆరగొండ గ్రామం, రాజంపేట్ మండలం
3. గున్‌రెడ్డి సంగారెడ్డి - మామ, ఎండ్రియల్ గ్రామం, తాడ్వాయి మండలం
నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. (వీడియో 👇)
జిల్లా ఎస్పీ హెచ్చరిక
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ భూములు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూమి యాజమాన్య హక్కులు, పాత రిజిస్ట్రేషన్ చరిత్ర, రెవెన్యూ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు, EC సర్టిఫికెట్ పూర్తిగా పరిశీలించాలన్నారు. విక్రేత అసలు యజమానియేనా అని ఆధార్, బయోమెట్రిక్ వివరాల ద్వారా నిర్ధారించుకోవాలని తెలిపారు.
నకిలీ పత్రాలు సృష్టించడం, మోసపూరిత రిజిస్ట్రేషన్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద భూ లావాదేవీల గురించి తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

إرسال تعليق