అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇప్పిస్తాం
కామారెడ్డి జిల్లా TUWJ (IJU) కార్యవర్గ తీర్మానం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని TUWJ (IJU) ఏకగ్రీవంగా తీర్మానించింది.
గురువారం జిల్లా కేంద్రంలో యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జిల్లా యూనియన్‌లో వివిధ పదవులు నిర్వహిస్తున్న వారు, కార్యవర్గ సభ్యులు తమ తమ మండలాల్లో స్థానిక జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలో యూనియన్ భవన నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్ర నాయకత్వం హామీ
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్.ఏ. లతీఫ్ మాట్లాడుతూ, జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
ఆమోదించిన తీర్మానాలు
సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు, కార్యవర్గ సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం 3 కీలక తీర్మానాలు చేశారు.
1. అక్రిడేషన్ కార్డులు: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోరాటం చేయాలి.
2. యూనియన్ బలోపేతం: జిల్లా వ్యాప్తంగా యూనియన్‌ను బలోపేతం చేసేందుకు ప్రతి సభ్యుడు కృషి చేయాలి.
3. హాజరు తప్పనిసరి: జిల్లా కార్యవర్గ సమావేశాలకు వరుసగా మూడు సార్లు గైర్హాజరైన వారిని కమిటీ నుంచి తొలగించాలి.
జిల్లా కార్యదర్శి తోట రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ఎన్నికల కమిటీ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి, అక్రిడేషన్ కమిటీ సభ్యులు సయ్యద్ కౌసర్, శశిధర్, మొయినుద్దీన్, అభిద్, యూనియన్ నాయకులు కులకర్ణి శ్రీనివాస్ రావు, ముదాం శంకర్, వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, మహ్మద్ యూనుస్, సురేష్, శ్రీకాంత్, బాలప్రకాష్, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.






Post a Comment