Top News

Collector, SP Review | భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటన, సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయి పర్యటన, సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

- లింగంపల్లి కుర్దు వద్ద దెబ్బతిన్న వంతెన పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం

- భారీ వర్షాలపై సమీక్ష - చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరిక  

- జిల్లాలో 171 గృహాలు, 4 చెరువులు, 32 రహదారులు దెబ్బతిన్నాయి - నష్టపరిహారం, పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : 

జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనతో పాటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్  రాజేశ్ చంద్ర ఈ సమీక్షలో పాల్గొన్నారు.

లింగంపల్లి కుర్దు వద్ద తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనుల పరిశీలన

లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామం వద్ద వరదలకు దెబ్బతిన్న తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంతెన పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతలో రాజీ పడొద్దని, భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు రాకుండా బలమైన నిర్మాణ ప్రమాణాలు పాటించాలని సూచించారు.

వంతెన మరమ్మతు పూర్తయ్యే వరకు గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు, భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ, పోలీసు శాఖలను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. 

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న లింగంపేట మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని కేకేవై రహదారిపై కి.మీ 121/2-4 వద్ద చేపట్టిన పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని, ఆ మార్గంలో రాకపోకలు పునరుద్ధరించబడ్డాయని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో ఎల్లారెడ్డి ఆర్‌డీఓ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

భారీ వర్షాలపై సమీక్ష - ప్రజలకు కలెక్టర్ సూచనలు

జిల్లాలోని వర్షాల పరిస్థితి, చెరువులు, వాగులు, రహదారులు, వంతెనలు, పాత భవనాలు, లోతట్టు ప్రాంతాలపై కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది.

కలెక్టర్ ఇచ్చిన ముఖ్య సూచనలు:

- చెరువులు, వాగులు, కాలువలు, నీటి ప్రవాహాల వద్దకు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదు

- యువత, పిల్లలు సెల్ఫీలు తీయడం, ఈత కొట్టడం, ఉధృత నీటిని దాటడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి

- తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలి

పెద్ద చెరువు హెచ్చరిక:

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి పొంగిపొర్లుతున్నందున, చెరువు పరివాహక ప్రాంతాలతో పాటు జీఆర్ కాలనీ ప్రజలు మరియు సమీప వార్డుల నివాసితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం లేకుండా చెరువు పరిసరాలకు వెళ్లవద్దని కోరారు.

వర్షాల వల్ల జరిగిన నష్టం 

జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 171 గృహాలు దెబ్బతిన్నాయి. వాటిలో 167 గృహాలు పాక్షికంగా, 4 గృహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 4 చెరువులు, 32 రహదారులు వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు అధికారులు నివేదించారు. నష్టపరిహార అంచనా, పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

చెరువుల కట్టలు, వంతెనలు, కల్వర్టులు, రహదారులు, పాత భవనాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు తలెత్తిన వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, డిప్యూటీ శిక్షణ కలెక్టర్ రవితేజ, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, ఆర్ అండ్ బి ఈఈ రమేష్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم