సిద్దిపేట ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఉదయ్ నాగరాజు: మాజీ మంత్రి హరీశ్ రావు
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సిద్దిపేట బిడ్డకు ఘనంగా పౌర సన్మానం
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి వ్యక్తి ఉదయ్
47 ఏళ్ల చిన్న వయసులోనే ఇంతటి అత్యున్నత పదవి దక్కించుకోవడం భారతీయులందరికీ గర్వకారణం
పల్లెటూరులో పుట్టి బ్రిటన్ చట్టసభకు చేరిన ఉదయ్ యువతకు ఆదర్శం
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వానికి ఆయన నిలువెత్తు నిదర్శనం
విపంచి కళానిలయంలో జరిగిన పౌర సన్మానంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
సిద్ధిపేట (తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో) :
బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజు పౌర సన్మాన కార్యక్రమం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఉదయ్ నాగరాజును శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఉదయ్ నాగరాజు తన పేరుకు తగ్గట్లే సార్థకత తీసుకొచ్చారని, తెలంగాణలో ఉదయించి బ్రిటన్‌లో వెలుగొందుతున్నారని ప్రశంసించారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజే అని, కేవలం 47 ఏళ్ల చిన్న వయసులోనే ఆ దేశ చట్టసభకు ఎన్నికైన తొలి భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు.
ఒక చిన్న పల్లెటూరులో పుట్టి, బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికయ్యే స్థాయికి ఎదగడం వెనుక ఆయన అపారమైన కృషి, పట్టుదల ఉన్నాయన్నారు. కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి అనడానికి ఉదయ్ జీవితమే ఒక ఉదాహరణ అని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి మనిషిలో ఒక అద్భుతమైన సామర్థ్యం ఉంటుందని, దానిని వెలికితీసి కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు.
ఉదయ్ నాగరాజు గారితో తనకు రెండున్నర దశాబ్దాల అనుబంధం ఉందని హరీశ్ రావు గుర్తుచేసుకున్నారు. ఆయన వివాహానికి కూడా తాను హాజరయ్యానని, ఆయన ఎంపీ కాకముందు లండన్ లోని వారి ఇంటికి కూడా వెళ్లానని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ మనమంతా ఎలాగైతే పోరాడామో, లండన్ లో ఉంటూ ఉదయ్ నాగరాజు గారు కూడా మాతృభూమి కోసం ఉద్యమానికి అంతే స్థాయిలో మద్దతు తెలిపి, తన వంతు భాగస్వామ్యం అందించారని కొనియాడారు.
ఖండాంతరాలు దాటి ఎంత ఎదిగినా ఆయన ఒదిగి ఉండే తత్వం అందరికీ ఆదర్శం అన్నారు. లండన్ లో ఉంటున్నప్పటికీ వారి అమ్మాయి అక్కడ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటోందని, వారు ఎంతో దూరంలో ఉన్నా మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మరువకుండా పాటిస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఎక్కడ ఎన్నికైనా ప్రజల కోసమే పనిచేస్తామని, అందరూ బాగుండాలని కోరుకునే గొప్ప వ్యక్తిత్వం తెలంగాణ ప్రజల సొంతం అన్నారు.
ఉదయ్ నాగరాజు కు సన్మానం చేయడం అంటే సిద్దిపేట ప్రజలకు, తెలంగాణకే కాకుండా యావత్ భారతీయులకు గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో బ్రిటన్ లో ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, అక్కడి ప్రజలకు గొప్ప సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని హరీశ్ రావు ఆకాంక్షించారు.








إرسال تعليق