నిజామాబాద్ నగరంలో ఇందిరమ్మ టౌన్‌షిప్ - 70 గ్రామాల్లో రెవెన్యూ రీ సర్వే
భూభారతిని పటిష్టంగా అమలు చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నిజామాబాద్: తమ ప్రభుత్వం ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకువచ్చిందని, దీన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శనివారం రెవెన్యూ అంశాలు, గృహ నిర్మాణ కార్యక్రమాల ప్రగతిపై నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్, స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు భవేశ్ మిశ్రా, ఆశిష్ సాంగ్వాన్, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రెండు జిల్లాల్లో 70 గ్రామాల చొప్పున సర్వేయర్లతో రెవెన్యూ రీ సర్వే చేయిస్తామన్నారు. గ్రామ నక్షా, సరిహద్దులు అన్నీ తిరిగి సర్వే చేస్తామని తెలిపారు. దీనికి ఎమ్మెల్యేలు, అధికారులు సహకరించాలని కోరారు.
రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, మరో 23 రోజుల్లో రెండో విడత ప్రారంభం అవుతుందన్నారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ తరహాలో ఇందిరమ్మ టౌన్ షిప్ నిర్మిస్తామని ప్రకటించారు. నగరంలో స్థలం కొరత ఉండటంతో నిరుపేదలకు ప్రభుత్వమే స్వయంగా ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు.
తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణాలకు భూమిపూజ
నిజామాబాద్ : నగరంలోని గూపన్ పల్లి పరిధిలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా. భూపతిరెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణతో కలిసి శనివారం భూమిపూజ నిర్వహించారు.
సాలూరా, డొంకేశ్వర్, ఏర్గట్ల, ఇందల్వాయి, మోపాల్, నిజామాబాద్ మండలాలకు చెందిన తహసీల్దార్ కార్యాలయాలు రూ.13.5 కోట్లతో, భీంగల్, నిజామాబాద్ గ్రామీణ మండలాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రూ.3.50 కోట్లతో నిర్మించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.





إرسال تعليق