Top News

Reporter's Death | నిజాంసాగర్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న హఠాత్ మృతి

నిజాంసాగర్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న హఠాత్ మృతి  

కారు నడుపుతుండగా గుండెపోటు... అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన కారు  

TUWJ (IJU) సంతాపం

కామారెడ్డి : నిజాంసాగర్ మండల ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న(53) బుధవారం గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. ఈ సంఘటనతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జర్నలిస్టు లోకంలో తీవ్ర విషాదం నెలకొంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆశన్న నిజాంసాగర్ మండల కేంద్రం నుంచి తన స్వగ్రామమైన ఆరేడుకు కారులో వెళ్తుండగా మార్గమధ్యలో అచ్చంపేట వద్ద ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆయనను ఎలారెడ్డి ఆస్పత్రికి తరలించేలోపే ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

25 ఏళ్లుగా పాత్రికేయ రంగంలో సేవ

సాలె ఆశన్న గత 25 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీనియర్ రిపోర్టర్‌గా పనిచేశారు. నిజాంసాగర్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ప్రాంతాల్లో ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తెస్తూ అనేక వార్తలు, కథనాలు రాశారు. అధికారులపై ప్రశ్నలు సంధించడంలో, రైతులు, పేదల గోడును ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అందరితో కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా ఉండే ఆశన్నకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

ఆయన ఆకస్మిక మరణ వార్త తెలియగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, పలువురు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో సంతాపం

ఆశన్న మృతి పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) కామారెడ్డి జిల్లా కార్యవర్గం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ అబ్దుల్ లతీఫ్ , అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు వేణుగోపాల్ చారి, ఎస్.కె. మొహియొద్దీన్, చంద్రశేఖర్, శశికుమార్, సయ్యద్ కౌసర్ అలీ, ఆబిద్, ఆంధ్రజ్యోతి కామారెడ్డి స్టాఫ్ రిపోర్టర్ ప్రశాంత్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, సుధాకర్ గౌడ్ తదితరులు సంతాప ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ, "ఆశన్న ప్రజల కోసం పనిచేసిన నిజాయితీ గల పాత్రికేయుడు. ఆయన మరణం జర్నలిస్టు రంగానికి తీరని లోటు. మేము తీవ్రంగా బాధపడుతున్నాం" అని అన్నారు. 

ఆశన్న కుటుంబానికి ప్రభుత్వపరంగా అందాల్సిన జర్నలిస్టు సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సంఘం నేతలు హామీ ఇచ్చారు.

ఆశన్న మృతితో జర్నలిస్టు రంగం ఒక మంచి సహచరుడిని, ప్రజలు ఒక నిజాయితీ గల గొంతును కోల్పోయారని సహచర విలేకరులు పేర్కొన్నారు.




Post a Comment

أحدث أقدم