ఆగస్టు 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కలెక్టర్లతో వీసీ నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల, జూపల్లి
హైదరాబాద్: ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 6 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పంట మార్పిడి, నీటి వినియోగంపై దృష్టి
వీసీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ పంట మార్పిడి విధానాల ద్వారా రైతులు నష్టపోకుండా ఉంటారని చెప్పారు. రైతులు పంట మార్పిడి పాటించేలా ప్రోత్సహించాలని, భూగర్భ జలాలు పెంపొందించేందుకు పంట కుంటల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వన మహోత్సవం లక్ష్యాల పూర్తికి ఆదేశం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉన్న నీటి వివరాలు తెలిపేందుకు గ్రామీణ స్థాయిలో ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలు నిర్వహించాలన్నారు. వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలని, నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని సూచించారు.
కామారెడ్డిలో కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వీసీలో పాల్గొన్నారు. వీసీ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ వన మహోత్సవం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని, నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ వీసీలో డీఎఫ్ఓ నీరజ్, అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్ వై గిరి, డీఆర్ఓ పాండు, సీఈఓ చందర్, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీఈఓ మల్లికార్జున్, వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహన్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق