హౌసింగ్ ఫైనాన్స్ ఉచ్చులో చిదిగిన కూలీ కుటుంబం...!
ఇల్లు జప్తుతో యువకుడి విషాద ముగింపు...!!
బస్వాయిపల్లిలో విషాదం
షేక్ మహబూబ్/నసురుల్లాబాద్, ఆగస్టు 30:
ఒక పూరి గుడిసె స్థానంలో తన ఇద్దరు చిన్న కూతుళ్లకు పక్కా ఇల్లు కట్టాలన్న 28 ఏళ్ల కూలీ కల.. చివరకు ఆ ఇల్లే అతని ప్రాణం తీసింది.
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బస్వాయిపల్లికి చెందిన పిట్టల విఠల్ (28) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ భార్య అనురాధ, కూతుళ్లు పావని (5), మైథిలి (3) తో జీవనం సాగిస్తున్నాడు. 2023లో సొంత ఇల్లు నిర్మించేందుకు హిందూజా హౌసింగ్ ఫైనాన్స్ నుండి రూ.8 లక్షలు, వెరిటాస్ ఫైనాన్స్ నుండి రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు. మొత్తం అప్పు రూ.20 లక్షల వరకు అయినట్లు తెలుస్తోంది.
కూలీ పని నుండి వచ్చే అతి తక్కువ ఆదాయంతో నెలవారీ వాయిదాలు కట్టలేకపోయాడు. దీంతో ఈ నెల 22న ఫైనాన్స్ సంస్థ తన కలల ఇంటిని సీజ్ చేసి తాళం వేసింది. అప్పటి నుండి భార్యాపిల్లలతో తల్లి ఇంట్లో తలదాచుకుంటున్నాడు.
భార్య అనురాధ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం - అప్పటి నుండి విఠల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. "చనిపోతాను" అంటూ తరచూ ఆవేదన వ్యక్తం చేసేవాడు.
ఆగస్టు 28న ఉదయం "పొలం వద్దకు వెళ్తున్నా" అని చెప్పి వెళ్లిన విఠల్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా ఫోన్ రింగ్ శబ్దం సీజ్ చేసిన తన ఇంటి నుండే వస్తుండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా విఠల్ విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఆరు, మూడేళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు తండ్రిని కోల్పోయి అనాథలయ్యారు. కట్టుకున్న ఇల్లు జప్తు కావడం, అప్పుల బాధతో కూలీ కుటుంబాలు ఎలా నలిగిపోతున్నాయో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టింది. నసురుల్లాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
_ఇలాంటి ఆర్థిక ఒత్తిడి, మానసిక వేదనలో ఉన్నవారు ఒంటరిగా నిర్ణయం తీసుకోవద్దు. సహాయం కోసం టెలి-మానస్ 14416 లేదా కిరణ్ 1800-599-0019 హెల్ప్ లైన్ ను సంప్రదించండి._

إرسال تعليق