బీర్కూర్‌లో రెండు ఇళ్ల చోరీ కేసు ఛేదన
నిందితుడి అరెస్ట్, ఇనుప రాడ్ స్వాధీనం
సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు
బాన్సువాడ, ఆగస్టు 19: బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు సంవత్సరం క్రితం జరిగిన రెండు ఇళ్ల చోరీ కేసును పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 01.08.2025న సాయంత్రం 7 గంటల సమయంలో బీర్కూర్‌లోని ఒక ఇంటి తాళం పగలగొట్టి, బీరువా తాళాలను కూడా ధ్వంసం చేసి బంగారం, వెండి ఆభరణాలను చోరీ చేశారు. అదే రాత్రి ఎదురుగా ఉన్న మరో ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని రూ.2,000 నగదును దొంగిలించారు. రెండు ఇళ్లలో చోరీకి గురైన వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.22,000గా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాన్సువాడ డీఎస్పీ, బాన్సువాడ రూరల్ సీఐ పర్యవేక్షణలో బీర్కూర్ ఎస్సై ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఫింగర్‌ప్రింట్ టెక్నాలజీ, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు.
ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన సకత్ గోపి అనుమానితుడిగా గుర్తించారు. 19.08.2026న మహారాష్ట్ర నుంచి బోధన్ వైపు వెళ్తున్న సమయంలో బరంగేడిగి గ్రామం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో సుమారు సంవత్సరం క్రితం బీర్కూర్ పరిధిలో దొంగతనానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. అతడి వద్ద నుంచి ఒక ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
నిందితుడి గత నేర చరిత్రను పరిశీలించగా 2022 సంవత్సరంలో బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో కూడా రిమాండ్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో మిగిలిన దర్యాప్తు కొనసాగుతోంది. నేరాల నియంత్రణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం, ఫింగర్‌ప్రింట్ మరియు సీసీ కెమెరాల వినియోగంతో నేరాలను ఛేదించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

إرسال تعليق