కామారెడ్డిలో నవీకరించిన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం
ట్రాఫిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి: పట్టణంలోని ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ భవనానికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి, ప్రజలకు అనుకూలంగా నవీకరించిన ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర శనివారం ప్రారంభించారు.
పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీ, ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించే ఉద్దేశంతో అవుట్‌పోస్ట్‌ను మెరుగుపరిచినట్లు ఎస్పీ తెలిపారు.
కొత్త ఎస్‌ఐకి బాధ్యతల అప్పగింత
ఈ సందర్భంగా కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్‌ను జిల్లా ఎస్పీ స్వయంగా విధి నిర్వహణ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. ట్రాఫిక్ నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, వేగవంతమైన స్పందనతో విధులు నిర్వహించాలని సూచించారు.
పోలీసు శాఖ ప్రధాన లక్ష్యాలు
అనంతరం మాట్లాడిన జిల్లా ఎస్పీ, పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ వ్యవస్థను పటిష్టం చేయడానికి అవుట్‌పోస్ట్‌కు అవసరమైన పోలీసు సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. రహదారులపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ వాతావరణం కల్పించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ట్రాఫిక్ పోలీసులు చట్టాలను అమలు చేయడమే కాకుండా ప్రజలకు సేవలందించే బాధ్యతను కూడా నిర్వర్తించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య కేంద్రాలు మరియు ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు.
ప్రజలకు రోడ్డు భద్రతా సూచనలు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుందని అన్నారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘించడం వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులు, పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. "ట్రాఫిక్ నియమాలు పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు. మీ కుటుంబం కోసం, మీ ప్రాణాల కోసం తీసుకునే ఉత్తమ నిర్ణయం. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలి" అని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ గౌడ్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసు అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
--------------------------------------------కామారెడ్డి పోలీసు కార్యాలయంలో విదేశీ దురాక్రమణ కలుపు నిర్మూలన
పర్యావరణ రక్షణలో పోలీసులు భాగస్వామ్యం
కామారెడ్డి: పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణలో భాగంగా జిల్లా పోలీసు శాఖ, ఈకో ఫాన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల గుర్తింపు, అవగాహన, నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఉదయ్ భాస్కర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ, సబ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.
ఆవరణలో స్వచ్ఛంద శ్రమదానం
కార్యక్రమంలో భాగంగా పోలీసు కార్యాలయ ఆవరణలో పెరిగిన విదేశీ దురాక్రమణ కలుపు మొక్కలను అధికారులు, సిబ్బంది స్వయంగా గుర్తించి తొలగించారు. అనంతరం సిబ్బందిని నాలుగు బృందాలుగా విభజించి, అత్యధికంగా కలుపు మొక్కలను నిర్మూలించిన బృందాలకు ఈకో ఫాన్ సొసైటీ తరఫున బహుమతులు అందజేశారు.
అవగాహన కార్యక్రమం
ఈ సందర్భంగా జీవవైవిధ్యానికి ముప్పుగా మారిన వయ్యారి భామ, కత్తెర ఆకు, మహావీర, ముళ్ల అలం వంటి విదేశీ దురాక్రమణ మొక్కలను తొలగించారు. పోలీసు సిబ్బందికి ఆయా మొక్కలను ప్రత్యక్షంగా గుర్తించే విధానం, వాటివల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
ఏఆర్ డీఎస్పీ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. జీవైవిధ్యం, వ్యవసాయం, అడవులు, పశువుల మేత భూములు, నీటి వనరులకు ముప్పుగా మారుతున్న విదేశీ దురాక్రమణ మొక్కలను సకాలంలో గుర్తించి నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈకో ఫాన్ సొసైటీ వ్యవస్థాపకులు మెట్టు సాయి సంపత్ మాట్లాడుతూ, విదేశీ దురాక్రమణ మొక్కలు స్థానిక వృక్షజాలాన్ని నాశనం చేయడంతో పాటు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని తెలిపారు. వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి నిర్మూలించడం ద్వారా తెలంగాణ సహజ సంపదను, స్థానిక జీవైవిధ్యాన్ని సమర్థవంతంగా సంరక్షించవచ్చని వివరించారు.
అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది "దురాక్రమణ విదేశీ కలుపు మొక్కలకు థంబ్స్ డౌన్" అనే సందేశంతో ప్రతీకాత్మక నిరసన తెలియజేస్తూ, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమం చివరలో విదేశీ దురాక్రమణ కలుపు మొక్కల నిర్మూలనలో ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఈకో ఫాన్ సొసైటీ ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




إرسال تعليق