ఎల్లయ్య చెరువు పూడికతీతతో జలకళ...!
టీచర్స్ కాలనీలో పెరిగిన భూగర్భ జలాలు
ఒకప్పటి ప్రధాన జలవనరు.. పూడికతో నిరుపయోగం
ప్రజాప్రతినిధుల చొరవతో పూడికతీత
రుద్రంగి అశోక్/తెలంగాణ డైలీ న్యూస్ - బాన్సువాడ
75 సంవత్సరాలుగా పూడికతో మూగబోయిన ఎల్లయ్య చెరువు తిరిగి ప్రాణం పోసుకుంది. పూడికతీత పనుల అనంతరం చెరువులో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు, చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరగడంతో టీచర్స్ కాలనీ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఒకప్పటి ప్రధాన జలవనరు.. పూడికతో నిరుపయోగం
ఎల్లయ్య చెరువు ఒకప్పుడు పట్టణానికి ప్రధాన జలవనరు. కానీ దశాబ్దాలుగా పూడిక పేరుకుపోవడంతో వర్షం నీరు కూడా నిల్వ ఉండేది కాదు. దీని ప్రభావం నేరుగా టీచర్స్ కాలనీతో పాటు చుట్టుపక్కల 3 కిలోమీటర్ల పరిధిలోని బావులు, బోర్లపై పడింది. వేసవిలో నీటి కోసం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రజాప్రతినిధుల చొరవతో పూడికతీత
ఈ సమస్యను గుర్తించిన శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎల్లయ్య చెరువును భారీ యంత్రాలతో పూర్తిస్థాయిలో పూడిక తీయించారు.
అధికారుల అంచనా ప్రకారం చెరువులో సుమారు 1.8 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు. ఫలితంగా చెరువు నీటి నిల్వ సామర్థ్యం 3 రెట్లు పెరిగింది. ఇప్పుడు వచ్చిన వర్షాలకు చెరువు పూర్తిగా నిండి జలకళను సంతరించుకుంది.
15 అడుగులు పెరిగిన భూగర్భ జలాలు
చెరువు నిండడంతో అతి తక్కువ సమయంలోనే ఫలితం కనిపించింది. టీచర్స్ కాలనీ పరిధిలోని 40కి పైగా బోర్లలో నీటి మట్టం సగటున 10 నుంచి 15 అడుగుల వరకు పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో 400 అడుగులకు వెళ్లినా నీరు రాని బోర్లు ఇప్పుడు 250 అడుగుల వద్దే జలధారను ఇస్తున్నాయి.
“గత 5 ఏళ్లుగా నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడ్డాం. ఇప్పుడు బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. ఈ వేసవికి ఎలాంటి సమస్య ఉండదు” అని టీచర్స్ కాలనీ వాసి రమేష్ ఆనందం వ్యక్తం చేశారు.
రైతులు, పశువులకు ఊరట
చెరువు నిండడంతో 150 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరనుంది. పశువులకు తాగునీటి సమస్య తీరడంతో పాటు, చెరువు గట్టున పచ్చదనం పెరిగి పర్యావరణానికి కూడా మేలు జరిగింది. వలస పక్షులు కూడా చెరువు వద్ద కనిపిస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు.
పనులు జరుగుతున్న సమయంలో కొందరు రాజకీయ లబ్ధి కోసం అపోహలు సృష్టించినా వాటిని పక్కన పెట్టి ప్రజాహితమే లక్ష్యంగా పనులు పూర్తి చేసిన తీరును పట్టణ వాసులు ప్రశంసించారు.
“చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది”
“చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది” అనే నానుడిని ఎల్లయ్య చెరువు మరోసారి రుజువు చేసిందని స్థానికులు అంటున్నారు. నీటి సంరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు మేలు చేసిన ఈ కార్యక్రమం గ్రామ అభివృద్ధికి కొత్త ఒరవడి సృష్టించిందని వారు పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, స్థానిక కౌన్సిలర్ ఖాలెక్, కో ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ కు పట్టణ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్లయ్య చెరువు వీడియో, ప్రజల అభిప్రాయాలు👇


إرسال تعليق