Top News

SP's Inspection | పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర

- ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి  

- కేసుల నమోదు, రికార్డుల నవీకరణలో నిర్లక్ష్యం వద్దు  

- రాత్రి గస్తీ, బీట్‌లు, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి  

కామారెడ్డి:  కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మంగళవారం దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రికార్డు గదులు, రైటర్ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌లో పరిశుభ్రతను ఎప్పటికప్పుడు కాపాడుకోవాలని, కేసులకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించి, నవీకరించాలని సిబ్బందికి ఆదేశించారు.

ఫిర్యాదుదారులకు ప్రాధాన్యత ఇవ్వాలి  

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల ప్రతి సిబ్బంది మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని, చట్టపరమైన పరిధిలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. కేసుల నమోదు, దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు  

నేరాల నియంత్రణకు అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో గస్తీ, బీట్‌లు, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రౌడీషీటర్ల కదలికలను పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. 

డయల్-100 ద్వారా వచ్చే అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించి, ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.ఈ తనిఖీలో బిక్కనూర్ సీఐ నరేష్, దోమకొండ ఎస్సై ప్రభాకర్, ఇతర ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




Post a Comment

أحدث أقدم