మీ ఫోన్ పోయిందా? భయపడొద్దు.. CEIR పోర్టల్ తో తిరిగి పొందండి: కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర
ఈ ఏడాది ₹1.81 కోట్ల విలువైన 1133 ఫోన్లు రికవరీ - 20 రోజుల్లోనే 139 ఫోన్లు స్వాధీనం
ప్రతి నెలా 150కి పైగా ఫోన్ల రికవరీ - ఇప్పటివరకు ₹8.66 కోట్ల విలువైన 5414 ఫోన్లు బాధితులకు అందజేత
కామారెడ్డి, సెప్టెంబర్ 01:
మొబైల్ ఫోన్ పోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, CEIR పోర్టల్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర భరోసా ఇచ్చారు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో మొబైల్ లో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత డేటా ఉంటుందని, అందుకే ఫోన్ రికవరీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని ఆయన అన్నారు. బాధితులకు త్వరిత న్యాయం కోసం ఇన్‌స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందం ప్రతి నెలా సగటున 150కి పైగా ఫోన్లను రికవరీ చేస్తోందని కొనియాడారు.
రికవరీ గణాంకాలు వెల్లడిస్తూ.. గత 20 రోజుల్లోనే ₹23 లక్షల విలువైన 139 ఫోన్లు, ఈ ఏడాది ఇప్పటివరకు ₹1.81 కోట్ల విలువైన 1133 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గత ఏడాది ₹3 కోట్ల విలువైన 1834 ఫోన్లను బాధితులకు అందజేశామన్నారు.
CEIR పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో మొత్తం 5414 ఫోన్లను ట్రాక్ చేసి ₹8.66 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు అప్పగించామని ఎస్పీ తెలిపారు.
ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, సిమ్ ను బ్లాక్ చేసి CEIR పోర్టల్ లో IMEI నంబర్ బ్లాక్ చేయాలని సూచించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రికవరీ అయిన ఫోన్ల కోసం బాధితులు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఎస్ఐ బాలరాజు (ఫోన్: 8712686114) ను సంప్రదించాలని కోరారు.

إرسال تعليق