రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి -
ఖర్గేను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి -
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, పోచారం భాస్కర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ, ధర్నా
కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేపై కుల వివక్షకు పాల్పడిన ఘటనను ప్రశ్నించిన లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నిజాంసాగర్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, దేశంలో కుల వివక్షకు, అంటరానితనానికి స్థానం లేదన్నారు. ఖర్గే గారు పాల్గొన్న సభా ప్రాంగణాన్ని గంగా జలాలతో శుద్ధి చేశారంటూ వచ్చిన ఘటన తీవ్రంగా ఖండించదగినదని అన్నారు.
ఖర్గే గారు ఒక దళిత నాయకుడు కావడం వల్ల ఆయన పాల్గొన్న ప్రదేశాన్ని శుద్ధి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని భావించడం అత్యంత దురదృష్టకరం. ఇది కేవలం ఖర్గే గారిని అవమానించడం కాదు, రాజ్యాంగాన్ని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను అవమానించడమే అని అన్నారు.
కుల వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ పోరాటం చేస్తూనే ఉందని, భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కులం మనిషి పుట్టుకను నిర్ణయించవచ్చు కానీ అతని గౌరవాన్ని నిర్ణయించదు. ప్రతి భారతీయుడికి ఆత్మగౌరవంతో జీవించే హక్కు ఉంది అని అన్నారు.
ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ గొంతును అక్రమ కేసులతో అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఖర్గేను అవమానించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి:
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై షబ్బీర్ అలీ తీవ్ర విమర్శలు గుప్పించారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని, ప్రజల కోసం పనిచేయని నాయకుడికి ప్రతిపక్ష నాయకుడి పదవి ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వరదలు, భారీ వర్షాలతో ప్రజలు నష్టపోయిన సమయంలో బాధితులను పరామర్శించడానికి కూడా కేసీఆర్, కేటీఆర్ రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఖాతాలో వందల కోట్ల నిధులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ కామారెడ్డి ప్రజలకు కనీస సహాయం కూడా చేయలేదని ఆరోపించారు.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధం:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై అభివృద్ధి, సంక్షేమం అంశాల్లో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
రైతులకు మద్దతు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, స్మార్ట్ రేషన్ కార్డులు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని వివరించారు.
జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిందని, దళిత నాయకుడైన ఖర్గేను అవమానించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హామీలను అమలు చేయలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్, పీసీసీ జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, PACS చైర్మన్లు గూడెం శ్రీనివాస్ రెడ్డి, అంతంపల్లి సుధాకర్ రెడ్డి, భీమ్ రెడ్డి, నవసిలాల్ నాయక్, అనంత్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, పాత రాజు, అంకం కృష్ణారావు, ఆశబోయిన శ్రీనివాస్, రాజా గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









إرسال تعليق