Top News

Bus Accident | జుక్కల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

జుక్కల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం - డివైడర్ ను ఢీకొని బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు, డ్రైవర్ మృతి

ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి - క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

కామారెడ్డి, సెప్టెంబర్ 04:

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జుక్కల్ చౌరస్తా సమీపంలోని 161వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, కండక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి.


ప్రమాద వివరాలు:

హైదరాబాద్ -1 డిపోకు చెందిన బస్సు నంబర్ TS34Z0030 (ఎక్స్ ప్రెస్), సర్వీస్ నంబర్ BCK3, హైదరాబాద్ నుంచి బిచ్కుంద వెళ్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో జుక్కల్ ఎక్స్ రోడ్ దాటి బిచ్కుంద సమీపంలోని కొలాన్ చౌరస్తా వద్ద అదుపుతప్పింది. బస్సు బలంగా డివైడర్ ను ఢీకొని పక్కకు బోల్తా పడింది. ప్రమాద ధాటికి బస్సు ముందు రెండు టైర్లు విడిపోయాయి.video 👇


ప్రమాదానికి సుమారు 200 మీటర్ల ముందు నుంచే బస్సు అదుపుతప్పి వంకరగా వెళ్తుండటాన్ని ప్రయాణికులు గమనించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కేకలు వేసినట్లు చెబుతున్నారు.

బస్సులో మొత్తం 13 నుంచి 15 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా బయటపడ్డారని, కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. డ్రైవర్ ఆంజనేయులు బస్సు కింద చిక్కుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బస్సును పైకి లేపి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. క్షతగాత్రులను అంబులెన్స్ ల ద్వారా మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.





మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి:

ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, పరిస్థితిపై ఆరా తీశారు. డ్రైవర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని, ఆర్ఎం నేతృత్వంలో అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదానికి పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఘటనపై బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, బిచ్కుంద సీఐ రవికుమార్ విచారణ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఈ ఘోర ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.



Post a Comment

أحدث أقدم