కాళోజీ సాహిత్యం ప్రజా జీవనానికి అద్దం
కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు
కామారెడ్డి, సెప్టెంబర్ 09: ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహిత్యం ప్రజల జీవన విధానానికి, ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టిందని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ప్రజల పక్షాన నిలిచి సామాజిక న్యాయం కోసం కాళోజీ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
కలెక్టరేట్ లో...
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ విక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాళోజీ తన రచనలు, కవిత్వం ద్వారా ప్రజల సమస్యలకు బలమైన స్వరం అందించారని, తెలంగాణ సమాజంలో సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు విశేష కృషి చేశారని తెలిపారు. కాళోజీ రచనల్లో సామాన్య ప్రజల జీవితం, వారి ఆకాంక్షలు ప్రతిబింబించాయని, అసమానతలపై తన రచనల ద్వారా ప్రశ్నిస్తూ చైతన్యం కలిగించిన మహనీయుడని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పాండు, డీఎంహెచ్ఓ వెంకటేష్, ఆర్డీఓ, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, అసిస్టెంట్ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు సాపా శివరాములు, కొంగర వెంకటి, నాగభూషణం, ఎంబీసీ నాయకులు శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కార్యాలయంలో...
జిల్లా పోలీస్ కార్యాలయంలో కూడా కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజా ఉద్యమాల గొంతుక అయిన కాళోజీ ఆశయాలు స్ఫూర్తిదాయకమని, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆయన సాహిత్యం కీలక పాత్ర పోషించిందని అన్నారు. కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఉదయభాస్కర్, ఆర్ఐలు కృష్ణ, సంతోష్ కుమార్, నవీన్, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.




إرسال تعليق