రైస్ మిల్లర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి
నిర్ణీత గడువులో బియ్యం అప్పగించేందుకు సిద్ధం: మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పప్పుల రాజేందర్ ప్రసాద్
కామారెడ్డి, సెప్టెంబర్ 08: రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, మిల్లింగ్ ప్రక్రియపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పప్పుల రాజేందర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వరి మిల్లింగ్ చేసి బియ్యం అప్పగించేందుకు నిర్ణీత గడువు విధించిందని, ఆ గడువులోపే బియ్యం అప్పగించేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
మిల్లర్లతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పదే పదే ఒత్తిడి తేవడం వల్ల మిల్లింగ్ వ్యవస్థ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను పరిశీలించకుండా మిల్లర్లందరినీ ఒకే కోణంలో చూడడం సరికాదన్నారు.
రైస్ మిల్లర్లు, అధికారులు, నిపుణులతో కలిసి సమావేశం నిర్వహించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. మిల్లింగ్ పై స్పష్టమైన విధానం రూపొందిస్తే రైతులకు, మిల్లర్లకు ఇరువురికీ ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి సంతోష్, కోశాధికారి సుదర్శన్, కామారెడ్డి డివిజన్ అధ్యక్షుడు భూమేష్ గుప్తా, మాజీ కార్యదర్శి గౌరీ శంకర్ తో పాటు నాగరాజు, రవీందర్, రాజేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

إرسال تعليق