వీరనారి చాకలి ఐలమ్మకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు
బాన్సువాడ పట్టణంలో తాడ్కోల్ రోడ్డులో ఐలమ్మ వర్ధంతి వేడుకలు
ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి - బీఆర్ఎస్ నేతలు
బాన్సువాడ, సెప్టెంబర్ 10: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట పటిమ చిరస్మరణీయమని అన్నారు. భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిందని పేర్కొన్నారు.
తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తూ పేదలు మరియు రైతుల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన ఐలమ్మ తెగువ మహిళా శక్తికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిందన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని తెలిపారు. చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంజిరెడ్డి, ఏఐబీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాం చందర్, మాజీ జెడ్పీటీసీ నార్ల రత్న కుమార్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు రమేష్ యాదవ్, మైనారిటీ నాయకుడు ఇసాక్, కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, మాక్బూల్, మొగులన్న, అనిల్ కుమార్, మోచి గణేష్, శివ సూరి, గంగారాం, వేణు, కాసుల బాబు, సాయులు, శంకర్, రాము, రజకులు తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق