ఎల్నినో ఎఫెక్ట్ తో కామారెడ్డిలో వర్షాభావం - వరి వద్దు ప్రత్యామ్నాయ పంటలు ముద్దు అంటున్న కలెక్టర్
72 రైతు వేదికల్లో 5 వేల మంది రైతులకు అవగాహన - భూగర్భ జలాలు 4 మీటర్లు పడిపోయాయని హెచ్చరిక
డ్రాగన్ ఫ్రూట్ తో రూ.5 లక్షల ఆదాయం - పామాయిల్ లో అంతర పంటలతో లాభాలు
కామారెడ్డి, అక్టోబర్ 12:
ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతు నేస్తం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రైతులకు సూచించారు. వాతావరణానికి అనుగుణంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో భూగర్భ జలాలు సగటున 4 మీటర్లు తగ్గిన నేపథ్యంలో నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
చిన్నమల్లారెడ్డి రైతు వేదికలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 72 రైతు వేదికల్లో సుమారు 5,000 మంది రైతులు, 200 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించారని తెలిపారు. వరికి బదులు కంది, పెసర, మినుములు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న సాగు చేయాలని కోరారు.
ఆదర్శ రైతులుగా శ్రీకాంత్, గుడిమెట్ రైతు:
మూడు ఎకరాల్లో పసుపు, ఉల్లి, కూరగాయలు, పెసర, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు శ్రీకాంత్ అనుభవాన్ని కలెక్టర్ ప్రస్తావించారు. రసాయన ఎరువులు తగ్గించి, వర్షపు నీటి కోసం కుంట, పెసరను పచ్చిరొట్ట ఎరువుగా, పందిరి విధానంలో సాగు చేస్తున్నాడు. అర ఎకరం డ్రాగన్ ఫ్రూట్ ద్వారా మొదటి ఏడాది రూ.1.50 లక్షలు, రెండో ఏడాది రూ.3 లక్షలు, మూడో ఏడాది నుంచి రూ.5 లక్షల ఆదాయం పొందుతున్నట్లు రైతు తెలిపారు.
అలాగే గాంధారి మండలం గుడిమెట్ గ్రామ రైతు 15 ఎకరాల్లో సోయా, మొక్కజొన్న, వరి సాగు నుంచి 2023 జూన్ లో పామాయిల్ సాగులోకి మారాడు. మొదటి ఏడాది పత్తి, మునగ; రెండో ఏడాది మునగ, కంది; మూడో ఏడాది బంతిపూలను అంతర పంటలుగా సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నాడు. మొదటి కోతలో 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చి 3-4 రోజుల్లోనే డబ్బు ఖాతాలో జమైందని తెలిపాడు. నీటి కొరతతో వరిని ఒక ఎకరానికే పరిమితం చేసి, యాసంగిలో మునగ వేయాలని నిర్ణయించుకున్నాడు.
సమగ్ర వ్యవసాయం, సహజ వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణతో రైతులు లాభాలు పొందవచ్చని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీమాయాల లక్ష్మి, ఏఎంసీ చైర్మన్ ధర్మగోని లక్ష్మి, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన అధికారి జ్యోతి, తహసిల్దార్ హిమబిందు, డీఆర్డీఓ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





إرسال تعليق