కామారెడ్డి కలెక్టరేట్ వద్ద NHM ఉద్యోగుల 13వ రోజు నిరవధిక సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు
కామారెడ్డి, అక్టోబర్ 25: తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న NHM ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద గత 13 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న NHM ఉద్యోగులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది.
ఈ రోజు జరుగుతున్న సమ్మె శిబిరాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండి. తాహెర్, జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షులు సబ్బిడి రమేష్ సందర్శించి, సమ్మెలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రజల ప్రాణాలను కాపాడే NHM ఉద్యోగులకు ఈ ప్రభుత్వంలో భద్రత లేకపోవడం సిగ్గుచేటు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేసిన వీరిని నేడు రోడ్డుపైకి తెచ్చింది ఈ ప్రభుత్వం. వీరిని వెంటనే రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వీరి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వారికి అండగా ఉంటుంది. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తాం" అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో NHM ఉద్యోగ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సుమన్, సెక్రటరీ పద్మజ, జిల్లా వ్యాప్తంగా NHM ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారితో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు, టీఆర్పీ కామారెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొని మద్దతు తెలిపారు.

إرسال تعليق