•బాన్సువాడలో రోడ్డు ప్రమాదం
•కుస్తీ పోటీలు చూసేందుకు వచ్చిన వ్యక్తి దుర్మరణం
•హనుమాన్లు విషాద గాథ
(తెలంగాణ డైలీ న్యూస్ - బాన్సువాడ)
"ఒక్కసారి కుస్తీ పోటీలు చూసొస్తా" అని ఇంట్లో చెప్పి బయలుదేరాడు కురుమ హనుమాన్లు. స్నేహితులతో కలిసి సందడిగా గడిపి, తిరిగి ఇంటికి వస్తానని భార్య బీరవ్వకు మాట ఇచ్చాడు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. (వీడియో 👇)
బిచ్కుంద మండలం గోపనపల్లికి చెందిన 58 ఏళ్ల హనుమాన్లుకు వ్యవసాయం తప్ప మరో లోకం తెలీదు. పొలం పనుల్లో అలసిన శరీరానికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని, ఊర్లో పిల్లలతో కలిసి బాన్సువాడలో జరిగే కుస్తీ పోటీలు చూడాలని శుక్రవారం ఉదయం ఉత్సాహంగా బయలుదేరాడు.
మధ్యాహ్నం తాడుకుల్ చౌరస్తాలో స్నేహితులతో కలిసి టిఫిన్ చేశాడు. "ఇంటికెళ్లే ముందు బస్టాండ్ దగ్గర కూల్ డ్రింక్ తాగుదాం" అని నవ్వుతూ చెప్పాడట. బైక్ ఎక్కబోతుండగా మృత్యువు డీసీఎం రూపంలో దూసుకొచ్చింది. క్షణాల్లో అంతా చెల్లాచెదురైంది. కడుపు నింపుకోవడానికి చేసిన టిఫిన్ అతని ఆఖరి భోజనం అయ్యింది.
హనుమాన్లు భార్య బీరవ్వ గుండెలు పగిలేలా రోదిస్తోంది. "పొద్దున నవ్వుతూ వెళ్లిన మనిషి, ఇప్పుడు మాట లేకుండా వచ్చిండు" అంటూ కన్నీరుమున్నీరవుతోంది. ఊర్లో అందరితో కలివిడిగా ఉండే హనుమాన్లు మరణవార్తతో గోపనపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఒక పండుగలాంటి కుస్తీ పోటీలు చూసేందుకు వచ్చిన అతనికి, రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఎదురైంది. డ్రైవర్ నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ బీరవ్వకు మాత్రం తన భర్త తిరిగిరాడనే నిజం జీర్ణించుకోలేకపోతోంది.
*ఘటన వివరాలు:*
బాన్సువాడ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపనపల్లి గ్రామానికి చెందిన కురుమ హనుమాన్లు (58) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
బిచ్కుంద మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన హనుమాన్లు వ్యవసాయ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి కుస్తీ పోటీలు వీక్షించేందుకు బాన్సువాడకు వచ్చాడు. ఒంటిగంటన్నర సమయంలో తాడుకుల్ చౌరస్తాలో టిఫిన్ చేసిన అనంతరం బస్టాండ్ వైపు వెళ్లేందుకు తన మోటార్ సైకిల్ వద్దకు చేరుకొని బైక్ ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది.
అదే సమయంలో కొయ్య గుట్ట వైపు నుంచి వస్తున్న టీఎస్ 18 టి 7137 నెంబర్ గల డీసీఎం వాహనాన్ని డ్రైవర్ అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చి హనుమాన్లు బైకును ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న హనుమాన్లు కింద పడిపోగా, డీసీఎం వాహనం టైరు అతని కడుపు, నడుము భాగం పైనుంచి వెళ్లింది. తీవ్ర రక్త గాయాలతో హనుమాన్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
మృతుని భార్య కురుమ బీరవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు బాన్సువాడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.


Post a Comment