RTC Strike Effect | పరీక్షలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు

బాన్సువాడలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ 

-పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకు ఇబ్బందులు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ సమ్మెతో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓపెన్ టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి బస్సులు డిపోలకే పరిమితం కావడంతో వివిధ గ్రామాల నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులు నానా తంటాలు పడ్డారు.

ప్రధాన రోడ్ల నుంచి ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించగా, డ్రైవర్లు అధిక ఛార్జీలు డిమాండ్ చేయడంతో విద్యార్థులు బిక్కమొహం వేశారు. అంత డబ్బు చెల్లించలేని స్థితిలో చాలామంది ప్రైవేట్ వాహనదారులను, బైక్‌లపై వెళ్తున్న వారిని బతిమాలి లిఫ్ట్ అడిగి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

ఆర్టీసీ డిపోలో బస్సులన్నీ బారులు తీరి నిలిచిపోగా, బస్టాండ్ ప్రాంగణం మొత్తం ప్రైవేట్ ఆటోలు, జీపులు, ఇతర వాహనాలతో కిక్కిరిసిపోయింది. అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు విద్యార్థులు, ప్రయాణికుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రయాణికులకు, ముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని పలువురు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. కనీసం పరీక్షల రోజుల్లోనైనా స్పెషల్ బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం : బాన్స్ వాడ డిపో మేనేజర్ 

 ఆర్టీసీ ఉద్యోగులు ఈరోజు విధుల్లో హాజరు కాలేదు. దీంతో అర్ధరాత్రి నుంచి బస్సు డిపో లోనే బస్సులు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయాణికులకు ఇబ్బందులు కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రైవేట్ బస్సులను ఆయారూట్లలో కొనసాగిస్తాం అవసరమైతే ప్రైవేటు కార్మికులను తీసుకొని బస్సులను నడిపిస్తాం


Post a Comment

Previous Post Next Post