దేవునిపల్లిలో కారులో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ - భారీ పేలుడు
మూడు కార్లు, బైక్ దగ్ధం - తప్పిన ప్రాణనష్టం
తెలంగాణ డైలీ న్యూస్,దేవునిపల్లి: కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. కారులో అక్రమంగా డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ నింపుతుండగా ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో మూడు కార్లు, ఒక బైక్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఘటన వివరాలు:
స్థానికుల కథనం ప్రకారం.. దేవునిపల్లిలో ఓ కారులో ఎల్పీజీ గ్యాస్ నింపుతున్నారు. ఈ క్రమంలో కారు ట్యాంక్ పేలడంతో భారీ శబ్దం వచ్చి దట్టమైన పొగలు వ్యాపించాయి. పేలుడు ధాటికి చాలా దూరం వరకు శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. భయంతో ప్రజలు పరుగులు తీశారు.
గ్యాస్ నింపుతున్న కారుతో పాటు పక్కనే పార్కింగ్ చేసి ఉన్న మరో రెండు కార్లు, ఒక బైక్ కూడా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాయి.
అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందన:
వెంటనే కామారెడ్డి ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది సకాలంలో రాకపోయి ఉంటే చుట్టు పక్కల ఇళ్లకు మంటలు వ్యాపించి ఉండేవని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ, గాయాల నష్టం జరగలేదు.
అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్‌పై ఆగ్రహం:
కార్లలో దొంగచాటుగా గ్యాస్ నింపడం చట్టవ్యతిరేకమని తెలిసినా కొందరు డబ్బులకు ఆశపడి అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్‌ను యథేచ్ఛగా వాహనాల్లో నింపుతూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఇలాంటి అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, నిఘా పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొంది.
.jpg)


Post a Comment