•ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
•జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
•రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్:
రైతు సంక్షేమంలో భాగంగా వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
మంత్రులతో కలిసి సీఎం సమీక్ష
మంగళవారం హైదరాబాద్ నుంచి మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ధనసరి అనసూయ, తుమ్మల నాగేశ్వర్ రావు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
సజావుగా కొనుగోళ్లు జరగాలి
అన్ని జిల్లాల్లో ప్రభుత్వ నిర్దేశిత విధానాల ప్రకారం ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని సీఎం సూచించారు. రవాణాలో జాప్యం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చాలి
కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, టార్పాలిన్లు, క్లీనింగ్ మెషీన్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని తెలిపారు. హమాలీల సమస్యలు రాకుండా గుత్తేదారులు మార్గదర్శకాలు పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రత్యేక అధికారుల నియామకం
జిల్లాల లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోళ్లు పూర్తి చేయాలని, సమస్యలు ఉన్న కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద గ్రామ స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు.
తాత్కాలిక గోదాముల ఏర్పాటు
గోదాములు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లలో తాత్కాలిక నిల్వ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లారీలు లేని చోట ట్రాక్టర్లు, ఇతర రవాణా వాహనాలను వినియోగించాలని తెలిపారు.
వాతావరణ హెచ్చరికలు, మీడియా స్పందన
వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ రైతులకు సూచనలు ఇవ్వాలని, కొనుగోలుపై ప్రతికూల వార్తలు వస్తే కలెక్టర్ల పేరుతో వెంటనే రిజాయిండర్లు విడుదల చేయాలని సూచించారు.
నేరుగా మిల్లులకు తరలించవద్దు
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారానే జరగాలని, నేరుగా మిల్లులకు తరలించవద్దని మిల్లర్లకు వివరించాలని తెలిపారు. టోకెన్ వ్యవస్థ, రసీదు విధానం నిబంధనల ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు.
TAB ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న TAB ఎంట్రీలను వెంటనే పూర్తి చేసి రైతులకు MSP చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని DCO, DRDA అధికారులను ఆదేశించారు.
వాహనాల లిఫ్టింగ్ వేగవంతం చేయాలి
అన్ని డిస్ట్రిక్ట్ మేనేజర్లు PPCల వద్ద సరిపడా వాహనాలు ఉంచి ధాన్యం లిఫ్టింగ్, రవాణా వేగవంతం చేయాలని సూచించారు. DCSO మిల్లుల వద్ద అన్‌లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించి వాహనాలు నిల్వ ఉండకుండా చూడాలన్నారు.
టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం రక్షణ కోసం అన్ని PPCలు, మిల్లుల వద్ద తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని DMOను ఆదేశించారు.
సమన్వయంతో పనిచేయాలి
ధాన్యం కొనుగోలు, రవాణా, TAB ఎంట్రీలు, ట్రక్ చిట్ జనరేషన్, మిల్లర్ అక్‌నాలెడ్జ్‌మెంట్ ప్రక్రియలను గడువులో పూర్తి చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, సివిల్ సప్లై అధికారి వెంకటేష్, DCO రామ్మోహన్, వ్యవసాయ అధికారి జ్యోతి, మార్కెటింగ్ అధికారి రమ్య, DRDA సురేందర్, RTO శ్రీనివాస్, DM శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment