Fake Suicide Drama | ఇన్‌స్టాలో ఆత్మహత్య డ్రామా!




ఇన్‌స్టాలో ఆత్మహత్య డ్రామా

వ్యూస్, లైకుల కోసం వీడియో 

యువకుడిపై కేసు 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం "ఆత్మహత్య చేసుకుంటున్నాను" అంటూ డ్రామా ఆడిన యువకుడిపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.

రెడ్లాన్ రోహిత్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భావోద్వేగ వీడియో రూపొందించి పోస్ట్ చేశాడు. విషయం గమనించిన కామారెడ్డి పట్టణ పోలీసులు వెంటనే అప్రమత్తమై అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో తాను కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసమే ఆ వీడియో చేశానని రోహిత్ ఒప్పుకున్నాడు.

ఈ ఘటనను అత్యవసర పరిస్థితిగా భావించి స్పందించాల్సి రావడంతో విలువైన పోలీసు సమయం, వనరులు వృథా అయ్యాయని కామారెడ్డి ఇన్స్పెక్టర్ నరహరి తెలిపారు. సంబంధిత చట్టాల ప్రకారం అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.



ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, కొన్ని లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆత్మహత్య డ్రామాలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు. "ఒక్క తప్పుడు పోస్ట్ వల్ల పోలీస్ యంత్రాంగం మొత్తం అత్యవసర పరిస్థితిగా భావించి పరుగులు తీయాల్సి వస్తుంది. పోలీసుల విలువైన సమయం ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి ఉపయోగపడాలి. ఇలాంటి చర్యల వల్ల నిజంగా ప్రాణాపాయంలో ఉన్నవారికి సాయం అందడంలో ఆలస్యం జరగొచ్చు" అని హెచ్చరించారు.

యువత రీల్స్, సోషల్ మీడియా మోజులో పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, కష్టపడి చదివి మంచి స్థాయికి చేరుకోవాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రుల ఆశలు నిలబెట్టేలా ముందుకు సాగాలని, క్షణిక గుర్తింపు కోసం తప్పుదారులు పట్టవద్దని కోరారు. పోలీసుల సమయాన్ని వృథా చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

=======================

భిక్నూర్ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు  

భూ వివాదంలో హత్య – ₹15,000 జరిమానా విధించిన కోర్టు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: 

భూ వివాదం కారణంగా జరిగిన హత్య కేసులో నిందితుడికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిత ఖైదు, రూ.15,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. భిక్నూర్ పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తుతో నిందితుడికి శిక్ష పడిందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.

*కేసు వివరాలు:*  

2022 నవంబర్ 14న కాట్రాల గ్రామానికి చెందిన కాసు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ముంబయిలో నివసించే తన తమ్ముడు కోరే సాయి జగదీష్ కనిపించకుండా పోయాడని, బిక్నూర్ శివారులోని ఎర్రగట్ల అటవీ ప్రాంతంలో అతని మృతదేహం సగం కాలిన స్థితిలో లభించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.


దర్యాప్తులో జగదీష్ తన అన్న కూతురు పెళ్లి కోసం స్వగ్రామానికి వచ్చి రెండు ఎకరాల భూమిని అమ్మాలని నిర్ణయించుకోగా, పదేళ్లుగా ఆ భూమిని కౌలుకు తీసుకుని గంధపు చెట్లు సాగు చేస్తున్న కుర్మా సాయిలు అడ్డుకున్నట్లు తేలింది. భూమి అమ్ముడైతే తనకు లాభం పోతుందని భావించిన సాయిలు, జగదీష్‌ను హత్య చేస్తే ఎవరూ హక్కు కోరరని పథకం వేశాడు.


2022 నవంబర్ 13 రాత్రి "మందు తాగుదాం" అని జగదీష్‌ను బైక్‌పై లక్ష్మాపూర్, బిక్నూర్ ప్రాంతాలకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఎర్రగట్టు వద్ద జగదీష్ మత్తులో ఉండగా బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గుంతలో పడేసి, బట్టలు ఉంచి మద్యం పోసి నిప్పంటించి ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నించాడు.


భిక్నూర్ పోలీసులు సాక్షులను విచారించి, ఆధారాలు సేకరించి నిందితుడు కుర్మా సాయిలు, అతని తండ్రి శివరాజును అరెస్ట్ చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. http://CH.VRR వర ప్రసాద్ నిందితుడు కుర్మా సాయిలుకు జీవిత ఖైదు, రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.



ఎస్పీ వ్యాఖ్యలు: 

"అత్యాశ, కోపం, క్షణికావేశం మనిషిని నేర మార్గంలోకి నెడతాయి. డబ్బు, ఆస్తి కోసం ప్రాణం తీస్తే చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. వివాదాలను శాంతియుతంగా, చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది" అని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.


నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పీపీ రాజగోపాల్ గౌడ్, సూర్యప్రసాద్, అప్పటి సీఐ తిరుపతయ్య, అప్పటి ఎస్‌ఐ కె. ఆనంద్ గౌడ్, ప్రస్తుత ఎస్‌ఐ డి. ఆంజనేయులు, సీఐ జె. నరేష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై రామేశ్వర్ రెడ్డి, సీడీఓ సంజీవరావులను ఎస్పీ అభినందించారు.

Post a Comment

Previous Post Next Post