Top News

Collector Visit to Banswada | ఎంసీహెచ్ ఆసుపత్రి, కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన


జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బాన్సువాడ పర్యటన  

•ఎంసీహెచ్ ఆసుపత్రి, కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బాన్సువాడలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులు, సిబ్బందితో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

వైద్య సేవలపై సమీక్ష  

ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, మెరుగైన సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. రోగులకు అవసరమైన చికిత్స, మందులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిశుభ్రత, సమయపాలన, సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.







నూతన ఏరియా ఆసుపత్రి పనులు  

అనంతరం నూతన ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న ఏరియా ఆసుపత్రి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, పురోగతిని సమీక్షించి పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విద్య, ఏఈ టీఎస్ఎంఎస్ఐడీసీ సాగర్ రెడ్డి, ఏరియా ఆసుపత్రి, ఎంసీహెచ్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

కొనాపూర్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన  

అదే రోజు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బాన్సువాడ మండలం కొనాపూర్ గ్రామంలో బోర్లం పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటివరకు 15,383 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేయగా, అందులో 11,683 క్వింటాళ్లను గోదాములకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 3,700 క్వింటాళ్ల మొక్కజొన్న కేంద్రంలో నిల్వ ఉంది.

వెంటనే తరలింపునకు ఆదేశం  

కొనుగోలు చేసిన పంటను ఆలస్యం లేకుండా గోదాములకు తరలించేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన 3,700 క్వింటాళ్లను తరలించేందుకు తగిన సంఖ్యలో లారీలను వెంటనే ఏర్పాటు చేయాలని డీఎం మార్క్‌ఫెడ్‌కు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా నిల్వ ఉన్న మొక్కజొన్న తడవకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీఓ, ఏడీఏ, తహసీల్దార్, ఎంఏఓ, సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, జీపీఓతో పాటు రైతులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post