కామారెడ్డి జిల్లాలో అకాల వర్ష బీభత్సం
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యం, రైతుల ఆందోళన
మాచారెడ్డి లో రైతుల ధర్నా
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: రోహిణి కార్తె ప్రారంభమైన వెంటనే కురిసిన అకాల వర్షాలు కామారెడ్డి జిల్లా రైతులను తీవ్ర కష్టాల్లోకి నెట్టాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లు, ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. అర్థరాత్రి కురిసిన వర్షాలకు కామారెడ్డి, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, సదశివనగర్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో 3 నుంచి 5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
మాచారెడ్డిలో రైతుల ధర్నా
మాచారెడ్డి మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు ఆరబెట్టిన వడ్లు పూర్తిగా నానిపోయాయి. తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాచారెడ్డిలో ధర్నా నిర్వహించారు. నానిపోయిన వడ్ల ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో మాచారెడ్డి ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి సుమారు ఒక కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.
మంగళవారం రాత్రి రెండో రోజు ఎల్లారెడ్డి, లింగంపేట్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పటికే వర్షానికి ధాన్యం తడుస్తున్నా కొనుగోళ్లు లేవని హాజీపూర్‌లో రైతులు రాస్తారోకో చేశారు. కళ్యాణిలో లారీలు రాక కొనుగోలు లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మల్లుపేటలో తడిసిన వరి ధాన్యం
ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి తెచ్చిన రైతుల వరి ధాన్యం తడిసి ముద్దయింది. విషయం తెలుసుకున్న సదాశివనగర్ మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు రాజేశ్వర్ రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకుడు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోనూ రాత్రంతా విస్తారంగా వర్షాలు కురిశాయి. మల్కాజిగిరిలో 21.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
వడ్లు మొలకెత్తే అవకాశం ఉండటంతో ఆరబెట్టడానికి అవస్థలు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించి కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.




Post a Comment