Phone Tapping Case | సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్


ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్  

వాంగ్మూలం నమోదు, కాంగ్రెస్ నేతల సంఘీభావం  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది.

సిట్ నోటీసులతో హాజరు  

ఈ కేసులో భాగంగా కామారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ టవర్స్‌లోని సిట్ కార్యాలయంలో హాజరై వాంగ్మూలం ఇచ్చారు.



విచారణలో ప్రశ్నలు  

ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అనుమానాలు, వ్యక్తిగత సమాచారం లీక్ అంశాలపై అధికారులు గంప ప్రసాద్‌ను ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు.


గంప ప్రసాద్ స్పందన  

విచారణ అనంతరం గంప ప్రసాద్ మాట్లాడారు. "నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ అధికారులు చెప్పే వరకు నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ వల్ల నా వ్యక్తిగత సమాచారం బహిరంగమై, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. నా వాంగ్మూలాన్ని వారు రికార్డు చేసుకున్నారు" అని తెలిపారు.

సంఘీభావం తెలిపిన నేతలు  

గంప ప్రసాద్ వెంట సిట్ కార్యాలయానికి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, మండల అధ్యక్షులు నౌసిలాల్ నాయక్, అంకం కృష్ణారావు, పల్లె రమేష్ గౌడ్, పాత రాజు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, సుతారి రమేష్, మహమ్మద్ సలీం, కిరణ్, రవీందర్ గౌడ్, వడ్ల సురేష్, టింకు భరత్, ఎజాస్, సుఫియాన్, డేవిడ్, రింకు తదితర కాంగ్రెస్ నాయకులు వెళ్లి సంఘీభావం తెలిపారు.

Post a Comment

Previous Post Next Post