Police Transfers | పారదర్శకంగా పోలీసు సిబ్బంది బదిలీలు: ఎస్పీ రాజేష్ చంద్ర



పారదర్శకంగా పోలీసు సిబ్బంది బదిలీలు: ఎస్పీ రాజేష్ చంద్ర  

కౌన్సెలింగ్ ద్వారా 146 మంది బదిలీ  

నైతికత, నిబద్ధతతో పనిచేయాలని ఎస్పీ ఆదేశం

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జిల్లాలో పారదర్శక విధానంలో పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పూర్తి చేశారు. మే 5న జిల్లా పోలీస్ కార్యాలయంలో కౌన్సెలింగ్ పద్ధతిలో మొత్తం 146 మంది సిబ్బందికి స్థానచలనం కల్పించారు.







కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్‌ల పరిధిలో పనిచేస్తున్న 8 మంది ఏఎస్సైలు, 18 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 111 మంది కానిస్టేబుళ్లు, ఎంటీ సెక్షన్‌కు చెందిన 9 మంది సిబ్బందిని బదిలీ చేశారు.

అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్‌పై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన కానిస్టేబుళ్లు, నాలుగేళ్లు పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుళ్లు, మూడేళ్లు పూర్తి చేసిన ఏఎస్సైలతో పాటు పదోన్నతి పొందిన వారితో ఎస్పీ స్వయంగా మాట్లాడారు. వారి ప్రాధాన్యత, విల్లింగ్ స్టేషన్లు, స్పౌస్, సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డును పరిగణలోకి తీసుకొని బదిలీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, పారదర్శక బదిలీలు బాధ్యతాయుత విధులకు పునాది అని తెలిపారు. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైలు క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు విశ్వాసం కలిగించేలా నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని, నైతికతతో ఉత్తమ సేవలు అందించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూధన్, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post