Beedi Contractors | బీడీ టేకేదార్ల చర్చలు సఫలం

బీడీ టేకేదార్ల చర్చలు సఫలం  

వెయ్యి బీడీలకు రూ.6 పెంపు, కొత్త కమిషన్ రేటు రూ.28.60 పైసలు  

ఏప్రిల్ 4 నుంచి అమలుకు యాజమాన్యం అంగీకారం

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, మే 6: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల పరిణిత హోటల్‌లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన బీడీ టేకేదార్ల, యాజమాన్యాల మధ్య చర్చలు సఫలమయ్యాయి. వెయ్యి బీడీలకు కమిషన్ రేటు రూ.6 పెంచేందుకు ఒప్పందం కుదిరింది.

దీంతో వెయ్యి బీడీలకు మొత్తం కమిషన్ రేటు రూ.28.60 పైసలకు చేరింది. పెరిగిన కమిషన్ రేటు 2026 ఏప్రిల్ 4 నుంచి అమలు చేయడానికి బీడీ యాజమాన్యం అంగీకరించింది.

తెలంగాణలో బీడీ పరిశ్రమలో పనిచేసే టేకేదార్లకు ప్రతి రెండేళ్లకు ఒకసారి వెయ్యి బీడీలకు కమిషన్ రేటు పెంచాల్సి ఉంటుంది. పాత ఒప్పందం 30-03-2026తో ముగియగా, 01-04-2026 నుంచి నూతన రేటు అమలు చేయాలి. దీనిపై తెలంగాణ బహుళ జన బీడీ టేకేదార్ యూనియన్ BLTU మార్చి 13న యాజమాన్యానికి డిమాండ్ నోటీసు ఇచ్చింది. ఇతర యూనియన్లు కూడా నోటీసులు ఇచ్చాయి.

చర్చలకు తెలంగాణ బీడీ యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హితేంద్ర ఉపాధ్య, ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర గాంధీ, దేశాయి బీడీ కంపెనీ నుంచి రాస్మికాంత్, టెలిఫోన్ బీడీ నుంచి రామన్ బాయి, చారు బాయి బీడీ నుంచి ప్రభాకర్, శివాజీ బీడీ నుంచి కల్పేష్ పటేల్ హాజరయ్యారు.

టేకేదార్ల యూనియన్ల తరఫున BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. సిద్దిరాములు, అధ్యక్షుడు ఎం. సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్, కుచని శేఖర్, వై. రాంచంద్రం, రాజు పాల్గొన్నారు. అలాగే BMS నుంచి కలాల్ శ్రీను, BRTU నుంచి ఎం. నర్సింలు, వేముల లక్ష్మణ్, TUCI నుంచి వనమల కృష్ణ, HMS నుంచి మల్లేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. సిద్దిరాములు మాట్లాడుతూ, టేకేదార్ల న్యాయమైన డిమాండ్‌కు యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post