ప్రమాద బాధితులను కాపాడితే రూ. 25,000 నగదు బహుమతి
జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు
ప్రజలంతా ‘రహవీర్’లుగా మారాలి
‘రహదారి వీరుల’ పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష
స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహణ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
జిల్లాలో రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడేందుకు ఉద్దేశించిన ‘రహదారి వీరుల’ పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఈ పథకం అమలు తీరుపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ప్రజలు తక్షణమే స్పందించి బాధితులకు సాయం చేయాలని, ప్రతి ఒక్కరూ 'రహదారి వీరులు'గా మారాలని పిలుపునిచ్చారు. ప్రమాదంలో ఉన్నవారిని సకాలంలో కాపాడిన వారికి ప్రభుత్వం తరఫున రూ. 25,000 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు
ఈ పథకాన్ని పారదర్శకంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో 'డిస్ట్రిక్ట్ అప్రిసియేషన్ కమిటీ'ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, సభ్యులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, జిల్లా రవాణా అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయ చర్యలు
ఆక్రమణల తొలగింపు, వన్యప్రాణుల అండర్‌పాస్‌లు: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా ప్రమాణాల మెరుగుదల కోసం చేపడుతున్న చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.
రహదారుల వెంబడి ఉన్న ఆక్రమణలు ప్రమాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో వాటి తొలగింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. హైవేల వెంట ఉన్న హోటళ్లు, భోజనశాలలకు అనధికారికంగా ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గాలను తొలగించి, నిబంధనల ప్రకారం మాత్రమే రాకపోకలు ఉండేలా చూడాలని ఆదేశించారు.
జాతీయ రహదారులపై వన్యప్రాణుల సంచారం కారణంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జంతువుల అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రతిపాదనలను వేగవంతం చేయాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ప్రతిపాదిత ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన అనుమతులు త్వరితగతిన పొందేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ భద్రతా సూచికలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేగ నియంత్రణ కోసం రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడంతో పాటు, మల్లుపేట, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు వంటి ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, షెవ్రాన్ మార్కింగ్‌లు, ఇతర రహదారి భద్రతా సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
ఈ సమావేశంలో రవాణా, పోలీస్, రోడ్లు-భవనాలు, జాతీయ రహదారుల సంస్థ, అటవీ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
*స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహణ*
*ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్*
*‘అమ్మకు అక్షరమాల’లో పాల్గొన్న 16,331 మంది మహిళలు*
కామారెడ్డి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, మహిళా వారోత్సవాల సందర్భంగా గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ సంఘాల ద్వారా మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఉపయోగకరమని అన్నారు. సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్‌మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడోలెసెంట్ కార్యక్రమం ద్వారా కిశోర, కిశోరీలలో ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, విద్య, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
మాక్ పార్లమెంట్‌లో పాల్గొన్న సభ్యులు విద్య, ఆరోగ్యం, బాల్య వివాహాల నిరోధం, మహిళా సాధికారత, పరిశుభ్రత అంశాలపై చర్చించి అభిప్రాయాలు వెల్లడించారు. యువత తమ సమస్యలను ధైర్యంగా వ్యక్తపరచడంతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సూచించారు.
అమ్మకు అక్షరమాలలో పరీక్షలు రాసిన మహిళలకు సన్మానం
ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘అమ్మకు అక్షరమాల’లో అక్షరాస్యత పరీక్షలు రాసిన మహిళలను జిల్లా కలెక్టర్ శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, మహిళల అక్షరాస్యత కుటుంబం, సమాజ అభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు. జిల్లాలో ఉల్లాస్ ద్వారా 16,331 మంది మహిళలు ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు రాశారని తెలిపారు. విద్య ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి కుటుంబ నిర్ణయాల్లో భాగస్వాములు కావడంతో పాటు సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతి సాధిస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడీఎల్ ఎస్పీ నరసింహ రెడ్డి, అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, డీపీఎం శ్రీనివాస్, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులు, స్నేహ సంఘాల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.




Post a Comment