•కామారెడ్డి పాత బస్టాండ్‌లో అగ్నిప్రమాదం
•విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం
•18 దుకాణాలు దగ్ధం
•ప్రభుత్వ సాయం కోసం బాధితుల ఎదురుచూపు
•పరామర్శించిన షబ్బీర్ అలీ కుమారుడు ఇలియాజ్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
పట్టణంలోని సిరిసిల్ల రోడ్ పాత బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం చిన్న వ్యాపారుల పాలిట శాపంగా మారింది.
ప్రమాద వివరాలు:
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో సుమారు 18 పండ్ల దుకాణాలు, పాన్ షాపులు, టీ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. వ్యాపారులు తమ ఆస్తులను కాపాడుకునేలోపే భారీ నష్టం వాటిల్లింది. పాత బస్టాండ్‌పై ఆర్థికంగా ఆధారపడిన పలువురు చిన్న వ్యాపారులు రోడ్డున పడ్డారు.
నాయకుల పరామర్శ:
ఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కుమారుడు, రాష్ట్ర యువజన నాయకుడు మహమ్మద్ ఇలియాస్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ఆయన వెంట డీసీ మాజీ అధ్యక్షుడు కైలా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, ఇప్ప శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
సాయం హామీ:
బాధితులతో మాట్లాడిన మహమ్మద్ ఇలియాస్, "జరిగిన నష్టాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్తాం. ప్రభుత్వం ద్వారా బాధితులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం" అని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదంలో ఆస్తి కోల్పోయిన వ్యాపారులను ఆదుకోవడానికి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ఘటనతో పాత బస్టాండ్ ప్రాంతంలో చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం తరఫున బాధితులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని నాయకులు భరోసా ఇచ్చారు.






Post a Comment