•కామారెడ్డిలో రూ.42.50 లక్షల భారీ చోరీ కేసు ఛేదన
•అంతర్రాష్ట్ర హిస్టరీ షీటర్ ఠాకూర్ జగన్ సింగ్ అరెస్ట్
•145 గ్రాముల బంగారం, 5.700 కిలోల వెండి స్వాధీనం: ఎస్పీ రాజేష్ చంద్ర
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణంలో జరిగిన రూ.42.50 లక్షల విలువైన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తెలుగు రాష్ట్రాల్లో 32 కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర హిస్టరీ షీటర్ ‘డీజే డానీ’ అలియాస్ ఠాకూర్ జగన్ సింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు.
కేసు వివరాలు:
విద్యానగర్ కాలనీ శ్రీ సాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అడ్డగుల్ల బాలకృష్ణ 11-04-2026న భార్యతో కలిసి వైద్య పరీక్షలకు హైదరాబాద్ వెళ్లారు. మరుసటి రోజు ఫ్లాట్ తాళం పగులగొట్టి 333 గ్రాముల బంగారు ఆభరణాలు, 10.290 కిలోల వెండి వస్తువులు, రూ.1,00,000 నగదు చోరీకి గురైనట్లు గుర్తించి కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల చర్యలు:
ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ సీఐ నరహరి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, ఎస్‌ఐలు, సిబ్బందితో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించారు.
నిందితుడు కరీంనగర్‌కు చెందిన ఠాకూర్ జగన్ సింగ్ @ దినేష్ సింగ్ @ DJ డానీ, 30 ఏళ్లు, దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రైవేట్ బస్సులో వెళ్తుండగా జాతీయ రహదారిపై చాకచక్యంగా పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
నిందితుడి నుంచి 145 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.700 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.42.50 లక్షలు. స్వాధీనంలో నెక్లెస్‌లు, గాజులు, గొలుసులు, ఉంగరాలు, వెండి ప్లేట్లు, గ్లాసులు, దీపాలు, పూజా సామగ్రి ఉన్నాయి.
నేర చరిత్ర:
నిందితుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 32 కేసులు ఉన్నాయి. కరీంనగర్‌లో 15, సైబరాబాద్‌లో 10, వరంగల్‌లో 4, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డిలో ఒక్కో కేసు నమోదైంది. 23 రాత్రి దొంగతనాలు, 6 సాధారణ దొంగతనాలు, 2 చైన్ స్నాచింగ్‌లు, 1 పగటి చోరీ కేసు ఉన్నాయి. 11 మంది సహచరులతో కలిసి నేరాలు చేసేవాడు.
నిందితుడిని కామారెడ్డి, కాకినాడ, మేడిపల్లి పోలీస్ స్టేషన్ల కేసుల్లో అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ప్రజలకు సూచనలు:
ఇళ్లకు ఎక్కువకాలం తాళం వేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సీసీ కెమెరాలు, అలారాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని ఎస్పీ సూచించారు.
కేసును ఛేదించిన డీఎస్పీ మధుసూదన్, టౌన్ సీఐ నరహరి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రామన్, ఎస్‌ఐ నాగరాజు, ఎస్‌ఐ ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో పాటు సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.


Post a Comment