బాసర మహంకాళి ఆలయంలో చోరీ
_వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లిన దుండగులు_
_గేటు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు_
_ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జానకి షర్మిల_
_నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులకు ఆదేశం_
తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి, నిర్మల్:
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం పైఅంతస్తులోని మహంకాళి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయ గేటు పగలగొట్టి లోపలికి ప్రవేశించి అమ్మవారి వెండి కిరీటం, హుండీని ఎత్తుకెళ్లారు. (వీడియో 👇)
హుండీని వ్యాసగుడి దగ్గర వదిలేసి పరార్
నగదు తీసుకున్న అనంతరం హుండీని వ్యాసగుడి సమీపంలో పడేసి దుండగులు పరారయ్యారు. ప్రతిరోజూ లాగే మంగళవారం తెల్లవారుజామున పూజ కోసం వెళ్లిన అర్చకులు చోరీని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఎస్పీ పరిశీలన, అధికారులకు ఆదేశాలు
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి కోణంలో దర్యాప్తు చేపట్టి నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
భద్రత పెంపుపై ఆదేశాలు
ఆలయ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఎస్పీ సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కేసు ఛేదనకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్పీ వెంట భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు రవీందర్ నాయక్, సమ్మయ్య, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది, దేవస్థాన అధికారులు ఉన్నారు.

Post a Comment